Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్‌ఐసీఏఓఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్
- ఎల్ఐసీ ఏజెంట్లు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- ఇందిరాపార్కు వద్ద ఎల్‌ఐసీఏఓఐ ఆధ్వర్యంలో మహాధర్నా
- 19 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఎల్ఐసీ ఏజెంట్లు
నవతెలంగాణ- అడిక్‌మెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) డ్రాప్టును వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్‌ఐసీఏఓఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ డిమాండ్ చేశారు. ఐఆర్డీఏఐ డ్రాప్టును ఉపసంహ రించుకోవాలని శుక్రవారం ఎల్‌ఐసీఏఓఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు తరలివచ్చారు. ప్లకార్డులతో తమ డిమాండ్లను తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం ఎల్‌ఐసీఏఓఐ ఆవిర్భవించిందని.. ఆ నాటి నుంచి ఏజెంట్ల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను కాపాడుతున్నదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐఆర్డీఏఐ డ్రాఫ్ట్ వల్ల ఎల్ఐసీ ఏజెంట్ల మనుగడతోపాటు వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. డ్రాఫ్ట్‌ను ఉపసంహరించకోకపోతే దేశ వ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత ఆర్ధిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని చెప్పారు. ఇలాంటి వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం దాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ బంగాళాఖాతంలో కలిపివేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను ప్రధాని, తెలంగాణ సీఎంకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామని చెప్పారు.
ఆర్గనైజేషన్ సౌత్ జోన్ అధ్యక్షులు ఎల్. మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహా రావు మాట్లాడుతూ.. ఎల్ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో లక్షలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందన్నారు. దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఐఆర్డీఏఐ డ్రాఫ్ట్‌ను ఉపసంహరిం చుకునే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, ఎల్ఐసీ ఏఓఐ ప్రధాన కార్యదర్శి పేజి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.