Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందమంది అనుచరులతో యువతి ఇంటిపై నవీన్‌రెడ్డి దాడి
- ఇంట్లో ఫర్నిచర్ వాహనాలు ధ్వంసం
- కుటుంబ సభ్యులను చితకబాదిన వైనం
- ఆదిభట్ల పోలీసులపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
- గతంలో నిందితునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- అయినా పట్టించుకోని పోలీసులు
- నిరసనగా మన్నెగూడ వద్ద రాస్తారోకో
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వంద మంది ఓ యువతి ఇంటిపై దాడిచేసి కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో నవీన్‌రెడ్డి అనే వ్యక్తి వంద మంది అనుచరులతో యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. యువతి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఇంట్లోని ఫర్నిచర్, కారు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గతంలోనూ నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే అతను రెచ్చిపోయాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మన్నెగూడ చౌరస్తాలో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. దాంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌తో నాగార్జునసాగర్ రహదారి స్తంభించింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని సిరి టౌన్షిప్లో ముచర్ల దామోదర్ రెడ్డి, నిర్మల కూతురు వైశాలి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆ కుటుంబానికి సమీప బంధువైన నవీన్‌రెడ్డి అనే వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఉంది. కొంతకాలం పాటు స్నేహంగా మెలిగారు. వీరు పెండ్లి చేసుకునేందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో నవీన్‌రెడ్డితో వైశాలి దూరంగా ఉంటుంది. ఇటీవల ఆ యువతికి పెండ్లి సంబంధం వచ్చింది. ఈ నేపథ్యంలోనే నవీన్‌రెడ్డి ఆ యువతిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. ఆ పథకంలో భాగంగానే శుకవ్రారం నవీన్‌రెడ్డి సుమారు 100 మందికి పైగా తన అనుచరులతో యువతి ఇంటిపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఉదయం 11:30 గంటల సమయంలో యువతి ఇంటిలోకి నవీన్‌రెడ్డి అనుచరులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఇంటి ముందున్న కారు అద్దాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇంట్లోనే ఉన్న వైశాలి, ఆమె తల్లిదండ్రులైన ముత్యాల దామోదర్ రెడ్డి, నిర్మలపై దాడి చేశారు. పక్కనే ఉన్న మరికొందరు ఆపే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడికి దిగారు. యువతి అరుస్తున్నా బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. వెంటనే యువతి తల్లిదండ్రులు 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు సకాలంలో రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీసుస్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లనే నవీన్‌రెడ్డి రెచ్చిపోయి తమపై దాడి చేసి కూతుర్ని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ మన్నెగూడ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. సుమారు ఐదు గంటలసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన దాడిపై ఆరా తీశారు. ఉదయం నుంచి సిరి టౌన్షిప్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాయంత్రం రాచకొండ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దాడి ఘటనను సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇదిలా ఉంటే నవీన్‌రెడ్డి నడుపుతున్న టీ సెంటర్‌ను యువతి కుటుంబ సభ్యులు ధ్వంసం చేసి నిప్పంటించారు. అందులో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కిడ్నాప్ అయిన యువతి నల్లగొండ జిల్లా పరిధిలోని ముసంపల్లి దగ్గర ఉన్నట్టు సోషల్‌మీడియాలో వార్తలు రాగా, వాటిని నల్లగొండ పోలీసులు ఖండించారు.