Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు
- బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభల సందర్భంగా కామారెడ్డిలో బహిరంగ సభ
నవతెలంగాణ- కామారెడ్డి టౌన్
బీడీ కార్మికులను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీఐటియూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 3వ మహాసభలు శుక్రవారం కామారెడ్డిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కామారెడ్డిలో బీడీ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సీఐటీయూ జెండాలు చేతబూని కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం బహిరంగసభ జరిగింది. ఈ సభలో సాయిబాబు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. బీడీల తయారీపై ఆంక్షలు పెడుతూ.. దానిపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలను రోడ్ల పాలు చేస్తోందన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తోందన్నారు. సిగరెట్ కంపెనీలను బతికించి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చి.. బీడీ కంపెనీల యజమానులకు ఇతర రంగాలకు ప్రొత్సహించే విధంగా లేబర్కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి మోడీ ప్రభుత్వం నష్టం చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించి 6వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో 72 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో జీవోలు సవరించి వెంటనే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు.. వారి సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించకుండా మోసం చేస్తున్నారన్నారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ధరలు పెరగడంతో సామాన్యులు, కార్మికులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. లేబర్కోడ్లు తెచ్చి కార్మికులను మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతున్నారని అన్నారు.
సమస్యలపై కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని, వారందరికీ సీఐటీయూ అండగా ఉంటుందన్నారు.బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరపు ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ, జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు నూర్జహాన్, వెంకట్ గౌడ్, సురేష్ గోండా, భాస్కర్, రాజు నర్సు.. మహబూబ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు