Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్లను పునరుద్ధరించాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
- ఐక్య ఉద్యమాలు విస్తరించాలి
- స్ఫూర్తివంతంగా టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
- ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్ఎన్ రెడ్డి
- పతాకావిష్కరణ చేసిన సీహెచ్ రాంచందర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించి, సంస్థను పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య అభిలషించారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు శనివారంనాడిక్కడి కామ్రేడ్ ఎన్ రాజయ్య నగర్, కామ్రేడ్ జే రంగయ్య హాల్ (సుందరయ్య విజ్ఞాన కేంద్రం)లో ప్రారంభమయ్యాయి. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రాంచందర్ అధ్యక్షతన రెండ్రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో ఎస్ వీరయ్య ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన మోటారు వాహన చట్టం-2019 వల్ల ఆర్టీసీలు మరణశయ్యపై ఉన్నాయని అన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు కోడ్లుగా మార్చడంతో కార్మికులు హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగాన్ని కాపాడతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని పరిరక్షించాలనీ, దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ స్వతంత్ర కృషి ఫలితంగా ఆర్టీసీలో ఐక్య ఉద్యమాలు జరిగాయన్నారు. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడి సంస్థను రక్షించుకోవాలని చెప్పారు. కార్మికులు నిర్భంధాలను ఎదిరించి పోరాడాలనీ, ఆ దిశగా మహాసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు 'విద్యుత్ బస్సులు-ఆర్టీసీ, సమాజంపై ప్రభావం' అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య ముఖ్య అతిధిగా పాల్గొని, ప్రసంగించారు. మహాసభలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ముసాయిదా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. కోశాధికారి ఏవీ రావు ఆర్ధిక నివేదికను, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఎస్‌డబ్ల్యూఎఫ్ పతాకాన్ని అధ్యక్షులు సీహెచ్ రాంచందర్ ఆవిష్కరించారు.
ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
2019 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల 55 రోజుల చారిత్రక సమ్మెకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఎస్‌డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపకులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్ఎన్ రెడ్డి ప్రారంభించారు. సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన పలు సంఘటనలు, ప్రభుత్వ నిర్భందాల ఛాయాచిత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలనే తీర్మానాన్ని వీరాంజనేయులు సభలో ప్రవేశపెట్టగా, ఏవీ రావు బలపరిచారు. ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను విడుదల చేయాలనే తీర్మానాన్ని కే బిక్షపతి ప్రవేశపెట్టగా, బీ రాంబాబు బలపరిచారు. మహిళలకు ప్రత్యేక డ్యూటీ చార్టులు వేయాలనీ, వారి సమస్యల్ని పరిష్కరించాలనే తీర్మానాన్ని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జే పద్మావతి సభలో ప్రవేశపెట్టగా, నూర్జహాన్, పీ రవీందర్‌రెడ్డి బలపరిచారు.