Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు
- ఆర్అండ్బీ శాఖలో అధికార వికేంద్రీకరణ
- 472 అదనపు పోస్టుల మంజూరు
- రోడ్ల మరమ్మతులకు రూ.635 కోట్ల నిధులు
- అత్యవసర పనులు చేపట్టేందుకు అధికారులకు స్వీయ నిర్ణయాధికారం
- రాష్ట్ర మంత్రివర్గంలో పలు నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నేరాల స్వభావం కూడా మారుతున్నదనీ, అందువల్ల వాటి అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని క్యాబినెట్ తీర్మానించింది. అందుకనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఐదు గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌పై దుష్ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింతగా పటిష్టం చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిళ్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. రోడ్లు భవనాల శాఖను పటిష్టం చేసేందుకు వీలుగా పునర్వవస్థీకరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఆయా స్థాయి అధికారులు స్వీయ నిర్ణయాలు తీసుకుని ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు మంత్రివర్గం అవకాశమిచ్చింది.
ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను క్యాబినెట్ మంజూరు చేసింది. ఇందులో... కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు., 12 సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టులు., 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు., 102 డిఇఇ పోస్టులు., 163 అసిస్టెంట్ ఇఇ పోస్టులు., 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు, 10 సర్కిల్ కార్యాలయాలు, 13 డివిజన్ కార్యాలయాలు, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది.
కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు (పీరియాడిక్ రెన్యువల్స్)ల కోసం, రూ. 1,865కోట్లు, తక్షణమే పనులు చేపట్టేందుకు రూ. 635 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వానలు, వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా డిఇఇ స్థాయి నుంచి సిఇ వరకు స్వతంత్ర నిర్ణయాధికారాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డిఇఇకి ఒక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు)., ఇఇ కి రూ.25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు)., ఎస్ఇ పరిధిలో రూ.50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సిఇ పరిధిలో రూ. 1 కోటి (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం..ఏడాదికి రూ. 129 కోట్లను ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు మంత్రివర్గం అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది.
బీసీ సంక్షేమ శాఖలో...
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియాకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన నాలుగు జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో అవసరమైన మేరకు నూతన నియామకాలను చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది.