Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- విద్యార్థులకు ల్యాప్‌టాప్, యూనిఫామ్స్ పంపిణీ చేసిన మంత్రులు
- రూ.5 కోట్లతో సైన్స్ బిల్డింగ్ ఏర్పాటుకు హామీ
- ఆర్జీయూకేటీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రులు
నవతెలంగాణ-బాసర
నైపుణ్యాభివృద్ధి వైపు అర్జీయూకేటీ విద్యార్థులు దృష్టిసారించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన 5వ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి హాజరై 550 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఐటీ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. డిజిటలైజేషన్, డి కార్బోనైజేషన్, డిసెంట్రలైజేషన్ ఈ త్రీడి విధానం వైపే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐటీ విద్యతో పాటు ఇండిస్టీయల్ రంగం వైపు దృష్టి సారించేలా యూనివర్సిటీ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు విద్యార్థులు దృష్టి సారిస్తుండటంతో విద్యార్థులకు వీటిలో మరిన్ని కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎన్నో రాష్ట్రంలో సేవలు అందిస్తున్నాయని అన్నారు. టీహబ్ ఏర్పాటు చేసినప్పుడు పలువురు దుష్ప్రచారం చేశారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ఐటీ హబ్ ద్వారా వచ్చిన కంపెనీలు ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించాయని అన్నారు. ఉన్నత విద్య అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్లే ఉన్నత విద్యారంగం ముందుకు వెలుతుందని అన్నారు. టీహబ్‌తో యూనివర్సిటీ అధికారులు ఒప్పంద, యూనివర్సిటీలో ఐదు కోట్లతో సైన్స్ బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. యూనివర్సిటీలోని చెరువు సుందరీకరణకు సింగరేణి, హెచ్ఎండీల సంబంధింత అధికారులు పర్యటించి ప్రణాళిక రూపొందిస్తారని అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల కోసం 10 పడకల ఆస్పత్రికి నిర్మాణనికి హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్‌భగీరథతో అనుసంధానం చేసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు తరగతి భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందిస్తానని అన్నారు. మన ఆర్జేయూకేటీ మన బాధ్యత పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పారిశుధ్య సిబ్బందిని నియమించుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో యూనివర్సిటీలో పర్యటించిన సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలలో భాగంగా విద్యార్థులకు 2,200 ల్యాప్‌టాప్‌లు, 1500 మంది విద్యార్థులకు డెస్క్ టాబ్లు యూనిఫామ్‌లను మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీ పడబోమని మెస్‌లపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే ఏకైక యూనివర్సిటీ అర్జీయూకేటీ అని... విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ ముషా రఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు.