Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీపై ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్
- విద్యార్థుల డ్రాపౌట్స్, ఆత్మహత్యలపై ఆందోళన
- దేశానికి కేరళ ప్రత్యామ్నాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ ప్రభుత్వ రూపొందించిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)తో దేశం నాశనమవుతుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విధానం కార్పొరేట్లకు, మనవాదులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రయివేటీకరణతో ఉపయోగం లేదనీ, ఇప్పటికే ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బీజేపీ ప్రయివేటు యూనివర్సిటీల రాకను ప్రోత్సహిస్తున్నదనీ, అదే జరిగితే విద్యార్థులు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బహుళ భాషల వైవిధ్యమున్న మన దేశంలో ఒకే భాషను అందరిపై రుద్దాలనుకోవడం చెల్లదని స్పష్టం చేశారు. ఎవరితోనూ చర్చించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న చట్టాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానం ఒక దాని తర్వాత ఒకటన్నట్టు కేంద్రం ముందుకు తెస్తున్నదని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేయడంలో భాగంగా ముందుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ తన విధానంతో మైనార్టీలను, దళిత విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నదని తెలిపారు. మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను రద్దు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. విద్యార్థుల డ్రాపౌట్స్, ఆత్మహత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాడేందుకు ఈ నెల 13 నుంచి 16 వరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ 17 జాతీయ మహాసభ దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభల్లో భాగంగా మొదటి రోజు 13న ఉదయం 11గంటలకు నగరంలోని ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థి కవాతు ప్రదర్శనను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ సభకు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వి.పి.సాను అధ్యక్షత వహించనుండగా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రధాన వక్తగా పాల్గొననున్నారు. తనతో పాటు ఎస్ఎఫ్ఐ జాతీయ గర్ల్స్ కన్వీనర్ థీఫ్సీతా ధర్, జాతీయ ఉపాధ్యక్షులు దీనిత్ డెంటా, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు నితీష్ నారాయణ్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు ఆల్.ఎల్.మూర్తి హాజరవుతారని వెల్లడించారు. దేశానికి కేరళ ప్రత్యామ్నాయం చూపించిందనీ, అక్కడి ప్రభుత్వం విద్యకు తగినంత బడ్జెట్ కేటాయిస్తున్నదని తెలిపారు. మహాసభ విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందనీ, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి ఎన్నికలపై దేశంలో, రాష్ట్రంలో నిషేధం పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య వాతావరణం అవసరమని తెలిపారు. అందరికీ మెరుగైన విద్య అందించే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ అందరికి విద్య - అందరికి ఉపాధి కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతున్నదని తెలిపారు. మహాసభలో 29 రాష్ట్రాల నుంచి 750 మంది ప్రతినిధులతో పాటు క్యూబా, శ్రీలంక తదితర దేశాల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొంటారని తెలిపారు. నాలుగు రోజుల పాటు నూతన జాతీయ విద్యావిధానంతోపాటు అన్ని విషయాలను మహాసభలో క్షుణ్ణంగా చర్చిస్తామనీ, ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్ష, కార్యదర్శుల సెషన్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. అనంతరం కేంద్ర కార్యవర్గం ఎన్నిక ఉంటుందన్నారు. విద్యకు జీడీపీలో ఆరు శాతం, బడ్జెట్లో 30 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. చదువు కోసం - ఉపాధి కోసం అందరం ఒక్కటవుదామంటూ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ స్పష్టతనివ్వాలి
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై బీఆర్ఎస్ తన వైఖరి తెలపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆల్.ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి స్పష్టతనివ్వాలని కోరారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తూ స్పష్టతనిచ్చాయని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ హామీ ఇచ్చారనీ, ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని విమర్శించారు. దేశంలో 30 కోట్ల మంది నిరుద్యోగులున్నారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతుందనీ, రాజ్యాంగం కోసం నిలబడుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ పోరాటాలకు మహాసభ వేదిక దిశానిర్దేశం చేయనున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలకు దక్కకుండా ఉద్దేశపూర్వకంగా దూరం చేస్తున్నదని తెలిపారు. జాతీయ స్థాయి ఫెల్లోషిప్లు 50 శాతం వరకు తగ్గించిందని ఉదహరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, రజినీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ అనూష, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి, ఆహ్వాన సంఘం కోశాధికారి జావీద్ తదితరులు పాల్గొన్నారు.