Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించనున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఈనెల 6న కవితను విచారించటానికి నిర్ణయించామంటూ సీఆర్పీసీలోని సెక్షన్ 160 కింద ఇది వరకే సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. అయితే, తాను ఆ రోజు అందుబాటులో ఉండననీ, మరో తేదీని నిర్ణయించాలంటూ సీబీఐకి కవిత లేఖ రాశారు. అనంతరం, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్తో పాటు ఫిర్యాదు కాపీని తనకు పంపించాలనీ, వాటిని పరిశీలించాకే తాను సీబీఐ అడిగే సమాచారాన్ని ఇవ్వగలనని పేర్కొంటూ ఢిల్లీలోని ఆ శాఖ డీఐజీకి మరో లేఖను కవిత రాశారు. అంతేగాక, ఈనెల 11, 12, 14, 15వ తేదీలలో తాను తన ఇంట్లో అందుబాటులో ఉండగలననీ, ఈ నాలుగు రోజుల్లో ఏ రోజు సీబీఐ అధి కారులు వచ్చినా.. తాను అందుబాటులో ఉంటానని తెలిపిన విషయం విదితమే. ఈ మేరకు ఆదివారం విచారణ జరపటానికి వస్తున్నామనీ, అందుబాటులో ఉండాలంటూ సీబీఐ అధికారులు కవితకు సమాచారం పంపినట్టు తెలిసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం కవితను విచారించనున్నట్టు సమాచారం. ఈ స్కామ్‌లో కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను విచారించనున్నట్టు సీబీఐ వర్గాలను బట్టి తెలిసింది.