Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డికి షాక్
- ఏ పదవి లేనోళ్లకు కీలక పోస్టులు
- రేవంత్‌రెడ్డిదే పై చేయి
- 26 మంది డీసీసీలు, నూతన కార్యవర్గం: ఏఐసీసీ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌లో గాడ్ ఫాదర్స్ ఉన్న వారినే అందలం ఎక్కించారు. అటువంటి వారికే టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎవరో ఒకరు పెద్ద దిక్కు ఉంటేగానీ పదవులు దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. రికమెండేషన్లు, ఫైరవీలు చేసుకుంటేగానీ పార్టీ పదవులు దక్కవని కొత్త కార్యవర్గ ప్రకటనతో తేలిపోయింది. ఏఐసీసీ ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే ఎన్నో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ పదవులు తమ అనుచరులకు దక్కేలా పార్టీ సీనియర్లు పంచుకున్నారు. కార్యవర్గంలో ప్రాతినిధ్యం కోసం పేర్లు పంపాలంటూ పార్టీ ఆదేశిస్తే పెద్ద జాబితానే ఇచ్చినట్టు తెలిసింది. అందులో ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇచ్చారు. ఏ బాధ్యత లేని వారికి నేరుగా కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను ఇచ్చారు. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడికి, మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉన్న చలమల కృష్ణారెడ్డి ఏకంగా ప్రధాన కార్యదర్శు లయ్యారు. ఇంకా చాలా మంది ఆ కోవలోకి వచ్చే వారు ఉన్నారు. పార్టీలో జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టుల్లో లేని వారికి కూడా అత్యంత కీలక పోస్టులు కట్టబెట్టారు. వరుస పరాజయాలతో పార్టీ కొట్టుమిట్టా డుతున్న నేపథ్యంలో కొత్త వారికి, యూత్‌కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో కొంత మంది సీనియర్ నేతలను పక్కన పెట్టారు. చాలా మంది పార్టీకి దూరంగా ఉన్న వారికి పదవులు కట్టబెట్టారు. సాధారణంగా పనితీరును బట్టి పదవులు ఇవ్వాల్సిన అధినాయకత్వం... ఎవరికి పడితే వారికి పదవులు ఇచ్చింది. రోజు గాంధీ భవన్ వస్తేనో, గాఢ్‌ఫాదర్ వచ్చినప్పుడు గాంధీభవన్‌లో హడావుడి చేసేవారికో, నాయకుల ఇంటికెళ్లి ప్రసన్నం చేసుకునే వారికి పార్టీ పదవులు ఇచ్చారనే విమర్శలొస్తున్నాయి. అయితే అందులో కొంత మంది నాయకులు పార్టీ కోసం కష్టపడే వారు ఉన్నారు. త్యాగం చేసేవారు లేకపోలేదు. నిస్వార్థంగా పని చేసేవారి జాబితా కూడా చాలా వున్నది. పార్టీ కార్యవర్గం కూర్పులో మాత్రం సీనియర్ల ముద్ర... రేవంత్ మార్క్ కనిపిస్తున్నదని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు కీలక బాధ్యత అప్పగించారు. అయితే మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ పదవి దక్కలేదు. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఏఐసీసీ...పార్టీ పదవిని ఇవ్వలేదు.పార్టీ సీనియర్ నేతలు జి నిరంజన్, కోదండరెడ్డి, కుమార్‌రావు, బక్క జడ్సన్ వంటి సీనియర్ నాయకులకు చోటు దక్కలేదు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కూర్పు చేశారననే వాదన వినిపిస్తున్నది. రానున్న ఎన్నికల్లో బరిలో దించే జాబితా కూడా ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి నేరుగా కీలక పదవులిచ్చారనే చర్చ జరుగు తున్నది. 26 జిల్లాలకు జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటించినా... ఎక్కువ మంది పాతవారినే కొన సాగించారు. హైదరాబాద్‌ను మూడు భాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ... హైదరాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. సికింద్రబాద్‌కు మాత్రం ప్రకటించలేదు. అందులో రాజకీయ వ్యవహారాల కమిటీ, కార్యవర్గం, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను నియమించింది. త్వర లోనే జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.