Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి థాకరే డిమాండ్
ముంబయి : మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. నాగ్పూర్ - ముంబయి సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఆదివారం పర్యటించనున్నారు. జల్నా వద్ద 42వ మరట్వాడా సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవంలో శనివారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ కర్నాటకతో నలుగుతున్న సరిహద్దు సమస్యతో పాటు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యలను మోడీ పరిష్కరించాల్సి వుందని చెప్పారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని జత్ తాలుకాలో గల కొన్ని గ్రామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేస్తున్న వాదన గురించి మోడీ కచ్చితంగా మాట్లాడాలని ఆయన అన్నారు. దశాబ్దాల నాటి ఈ సమస్య ఇటీవల పతాక శీర్షికలకెక్కుతోంది. గత నెల 22న బొమ్మై మాట్లాడుతూ, జత్ తాలుకాపై తమ రాష్ట్రానికి గల హక్కు గురించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని అన్నారు. ఆ ప్రకటనతో మహారాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. 1960లో ఏర్పడిన నాటి నుంచి మహారాష్ట్రకు కర్ణాటకతో వివాదం కొనసాగుతోంది. బెల్గాంపై, కర్ణాటకలో మరాఠి మాట్లాడే గ్రామాలపై ఈ వివాదం రేగింది. దీంతో అల్లర్లు, ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతూనే వుంటాయి. పాలకులను ప్రశ్నించడం ద్వారా సమాజాన్ని మార్చడంలో రచయితలు కీలకపాత్ర పోషించవచ్చునని థాకరే వ్యాఖ్యానించారు. కేవలం సెమినార్లు పెడితే సరిపోదని, రచయితలు కూడా వీధుల్లోకి వచ్చి పాలకుల తప్పులను ప్రశ్నించాలని అన్నారు. కానీ, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని జైళ్లకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థపై పెత్తనానికి కేంద్రం యత్నం
కొలిజీయం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే స్పందించారు. న్యాయ వ్యవస్థను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అన్నారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోలేకపోతే, అప్పుడు ప్రధాని వారిని ఎంపిక చేయవచ్చని వ్యాఖ్యానించారు.