Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీతో ప్రయాణం
- ఇద్దరు గురుస్వాములు, వంటమనుషులు, 12 ఏండ్లలోపు వారికి ఉచిత ప్రయాణం
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అయ్యప్ప స్వామి భక్తులకు ఎలాంటి డిపాజిట్ లేకుండా రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. యాత్రీకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారంనాడాయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ అద్దె బస్సుల కోసం దగ్గరిలోని డిపో మేనేజర్లను సంప్రదించాలని కోరారు. అయ్యప్ప స్వామి భక్తులు ప్రయివేటు బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిచాలని నిర్ణయించామన్నారు. ఎలాంటి డిపాజిట్ అవసరం లేదనీ, పైగా పది శాతం రాయితీతో సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో పాటు ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మనుషులు, 12 సంవత్సరాల లోపు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితమని తెలిపారు. అలాగే యాత్రా బస్సుల్లో ఆడియో, వీడియో తోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు. బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడుపుతామన్నారు. ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల కోసం, సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040-23450033, 69440000 సంప్రదించాలని పేర్కొన్నారు.