Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకర పరిస్థితుల్లో దేశం
- 'గాంధీత్వ నుంచి హిందూత్వ దాకా' పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారనీ, వాస్తవానికి హిందూత్వ ఎజెండా వల్లే మోడీకి ఆ విజయం సాధ్యమైందని సీనియర్ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. ఇదే సమ యంలో గుజరాత్లో వచ్చిన ఫలితం హిమాచల్, ఢిల్లీలో ఎందుకు రాలేదో చెప్పాలంటూ బీజేపీని ప్రశ్నించారు. మూడు చోట్ల మూడు పార్టీలకు ప్రజలు ఎందుకు పట్టం కట్టారో తెలుసుకోవాలంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం రచించిన 'గాంధీత్వ నుంచి హిందూత్వ దాకా' అనే విశ్లేషణాత్మక వ్యాస సంపుటిని శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రామచంద్రమూర్తి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దేశ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రమాదకర పరిస్థితులను అర్థం చేసుకోవటం, వాటిపై రచనలు చేయటం, తద్వారా సమాజాన్ని జాగృతం చేయటం అభినందనీయమన్నారు. కుహనా హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న, మాట్లాడుతున్న సమసమాజ స్వాప్నికులకు ఇదో అక్షరాయుధమని ప్రశంసించారు. భాస్కరం సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని చెప్పారు. పండిత
భాస్కరం సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని చెప్పారు. పండిత కుటుంబంలో పుట్టిన్పటికీ, పురాణ ఇతిహాసాలు చదువుకున్నప్పటికీ మోడీకి భక్తుడేం కాదని తెలిపారు. ఆయన నూటికి నూరుపాళ్ళ ప్రజాస్వామిక, లౌకిక, రాజ్యాంగ బద్దుడని చెప్పారు.ఇలాంటి రచయితలు ఇప్పుడు ఈ దేశానికి కావాలన్నారు. దేశం ఇప్పుడు ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం అన్నింటికంటే ముఖ్యమైందని చెప్పి, హిందూత్వం కోసం మిగతా అన్ని విషయాలను పూర్వ పక్షం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. దేశ రాజకీయాల్లో, సంస్కృతిలో బహుళత్వం ఉండడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజకీయంగా, పరిపాలనా పరంగా ఏకీకృత వ్యవస్థ నిర్మాణం కోసం దేశంలో ప్రయత్నం జరుగుతుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫెడరల్ వ్యవస్థను రద్దు చేసి, సెంట్రల్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నం జరుగుతున్నదని తెలిపారు. ఇది పన్నుల విధానంలోనూ, విద్యా, చివరికి నీటిని కూడా ఏకీకృతం చేసే విధానాన్ని తీసుకొస్తున్న స్థితి కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ప్రమాదకర మన్నారు. రాష్ట్రాల హక్కులు హరించబడుతుంటే..కేంద్ర పెత్తనం పెరుగుతున్న దశలో రాష్ట్రాలు చూస్తూ ఊరుకుంటాయా? చూస్తూ ఊరు కోవాలా? ముఖ్యంగా పౌరసమాజం మౌనంగా ఉండాలా? అని బుద్దిజీవులను ప్రశ్నించారు. ముస్లింలను రెండో తరగతి పౌరులుగా పర గణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోమాసం తీసుకుపోతున్నారని హత్య చేయటం,గౌరీ లంకేశ్, కల్బుర్గి హత్య తదితర అంశాలు ఈ పుస్తకంలో భాస్కరం స్పృశించారని వివరించారు. ప్రతి వ్యాసంలో హేతువాదం, ప్రజాస్వామ్య స్పృహ, రాజ్యాంగనిబద్దత ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యమంటే..చర్చని తెలిపారు. అంతే తప్ప అరెస్టులు చేయటం, విలేకర్ల సమావేశాలే నిర్వహించక పోవటంకాదనీ, మంకీబాత్లు పెట్టటమేకాదని చెప్పారు. తమ భావాలను వ్యక్తీకరించటం ప్రజాస్వామ్యం లో భాగమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్ మాట్లాడుతూ ఈ పుస్తకం చాలా విలువైనదన్నారు. ఇటీవల జర్నలిస్టులు రాసిన అతి విలువైన పుస్తకమిదని చెప్పారు. ఇందులో లోతైన తాత్విక విషయా లున్నాయని వివరించారు. గాందీత్వó వర్సెస్ హిందూత్వ అంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అప్పటికీ, ఇప్పటికీ గాంధీత్వ, హిందూత్వ వాదాల మధ్య తీవ్ర వైరుధ్యముందని వివరించారు. గాంధీ ఫిలాసఫీ స్వాతంత్య్రం తర్వాత ఎలా ఉంటుందో ఊహించే ఆయన్ని హత్యచేశారని చెప్పారు. గాంధీని హత్యచేశారుగానీ..గాంధీత్వాన్ని కాదని తెలిపారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది యుద్ధసమయ మన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ పుస్తకం రావటం సరైందేనని చెప్పారు. భావజాల యుద్ధమే కాదు..భౌతిక యుద్ధం కూడా సాగుతున్న కాలమిదని విశ్లేశించారు.ఈ పుస్తకం ఎక్కువమందని ప్రభావితం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పుస్తక పరిచయాన్ని బీపీ పడాల చేయగా శ్రీశైల్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు.