Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిలో 40 మంది పాల్గొన్నట్టు నిర్ధారణ
- మరికొందరు నిందితుల కోసం గాలింపు
- పరారీలో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి
- ఎన్ఆర్ఐ అర్హత పరీక్షకు హాజరైన వైశాలి
- నవీన్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. : బాధితురాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ లోని మన్నెగూడలో డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు 32 మందిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి పరారీలోనే ఉన్నాడు. ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌రెడ్డికి తెలిసింది. పెండ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నీచర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. కార్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని బలవంతంగా లాక్కెళ్లి నవీన్‌రెడ్డి కారులో అపహరించు కుపోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు అప్రమత్తమై ఆరు గంటల్లోనే దుండగుల వాహనాన్ని నల్లగొండ జిల్లా ముషంపల్లిలో గుర్తించి అమ్మాయిని రక్షించారు. 32 మందిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కాగా, నిందితుల కుటుంబీకులు ఆదిభట్ల పోలీసు స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తమ పిల్లలకు ఏమీ తెలియదని వదిలేయాలని పోలీసుల వాహనానికి అడ్డంగా వెళ్లి ఆందోళన చేశారు.
నవీన్‌రెడ్డి కోసం గాలింపు..
వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతని కోసం హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కిడ్నాప్ వ్యవహారానికి ముందు పార్టీ పేరుతో తన అనుచరులను, తన టీ షాపుల్లో పనిచేసే సిబ్బందిని నవీన్‌రెడ్డి పిలిపించుకున్నాడు. యువతి ఇంటి సమీపంలో ఉన్న అతని మిస్టర్ టీషాప్‌లో మద్యం ఏర్పాటు చేశాడు. అనంతరం మత్తులో ఉన్న వారందరినీ తీసుకుని వాహనాల్లో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటిపై దాడి చేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశాడు. యువతి కిడ్నాప్ తర్వాత వివిధ మార్గాల్లో దుండగులు పారిపోయారు.
ఎన్ఆర్ఐ అర్హత పరీక్షకు వైశాలి హాజరు..
కాగా, బాధితురాలు వైశాలి శనివారం ఎన్ఆర్ఐ అర్హత పరీక్షకు హాజరయ్యారు. ఆమెకు శుక్రవారం స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసు బందోబస్తు మధ్యనే పరీక్షకు హాజరైన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే.. : వైశాలి
నవీన్‌రెడ్డితో పరిచయమే తప్ప ఎలాంటి ప్రేమా లేదని వైశాలి స్పష్టం చేశారు. ఆమె శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తనను కాదని మరొకరిని ఎలా పెండ్లి చేసుకుంటావని నవీన్‌రెడ్డి తనను బెదిరించాడని చెప్పారు. అతనిపై తనకు ఎలాంటి ప్రేమా లేదన్నారు. తమ ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసి, అమ్మానాన్నను కొట్టారని, తనను బలవంతంగా లాక్కెళ్లి కారు తోశారని చెప్పారు. తన డాడీని చంపేస్తానని నవీన్‌రెడ్డి బెదిరించినట్టు ఆరోపించారు. కారులో తనను కొట్టాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరియర్ మొత్తం పాడు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేశాడని చెప్పారు. తనకు అతనితో పెండ్లి జరిగిందని అబద్ధాలు చెప్పాడని, అందులో నిజం లేదన్నారు. అతని తల్లి కూడా కొడుకు దొరికిపోయాడని అన్నీ అబద్ధాలు మాట్లాడుతోందని, వారు చెబుతున్న తేదీన తాను ఆర్మీ డెంటల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్లో ఉన్నానని, తన వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని చెప్పారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మూడు నెలల కిందటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కానీ పొలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే పోలీసులు పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదన్నారు. తాను ఎలాంటి పేపర్లపైనా సంతకాలు పెట్టలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి :ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిని, అతనికి సహకరించిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌తో కలిసి ఆమె శనివారం వైశాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.