Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా స్వాగతం పలికిన కేరళీయులు
- ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభల నేపథ్యంలో మన రాష్ట్రంలోని జనగాం జిల్లా కడివెండి గ్రామం నుంచి ఈనెల 5న ప్రారంభమైన రైతు అమరవీరుల జ్యోతి...శనివారం కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్కు చేరుకుంది. యాత్ర బృందానికి కేరళీయులు, రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రెడ్షర్డు వాలంటీర్ల కవాతు, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరువీరుల జ్యోతిని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్ అందుకున్నారు. తెలంగాణ నుంచి ప్రారంభమైన యాత్రకు ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యులు టి. సాగర్ నాయకత్వం వహిస్తారు. రెండో యాత్ర తమిళనాడులోని కిజ్వ్న్మణిలో ప్రారంభమైంది. దీనికి ఏఐకేఎస్ సహాయ కార్యదర్శులు డాక్టర్ విజ్జు కృష్ణన్, ఎస్కె ప్రీజా నాయకత్వం వహించారు. తెలంగాణలో ప్రారంభమైన యాత్ర కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్కు చేరనుంది. ఈ సందర్భంగా యాత్ర డిప్యూటీ నాయకులు టి సాగర్ మాట్లాడుతూ రైతు అమరవీరుల జ్యోతి యాత్రకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యలు, ఎరువుల సబ్సిడీ ఎత్తేయడం, సబ్సిడీలు రద్దు చేయడం వంటి చర్యలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని చెప్పారు. రైతు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.