Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే బీజేపీ విధానం
- ఇదే జరిగితే మళ్లీ మనువాదం నాటి పరిస్థితులే
- ఎన్ఈపీపై అన్ని రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిందే
- విద్యారంగంలో కేరళ అగ్రగామి
- మాటలే కాదు...చేతలతో చూపిన ఎల్టీఎఫ్ సర్కార్
- మహాసభల ద్వారా విద్యార్థి ఐక్య ఉద్యమాలకు దిశా నిర్దేశం
- నవతెలంగాణతో ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్
గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ కార్పొరేటీకరణ, కాషాయీకరణ విధానాలతో విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులకే కాదు... దేశ భవిష్యత్తుకు కూడా నష్టదాయకమని ఆయన హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత విధానాలతో మళ్లీ మనువాదాన్ని రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ఆయా విధానాలు పూర్తిగా అమలయితే దేశీయ విద్యారంగం మళ్లీ మనవాదం నాటి పరిస్థితుల్లోకే నెట్టివేయబడుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కంటే ముందు, ఆ తర్వాత కూడా విద్యారంగాన్ని నిలబెట్టడంలో కేరళ వామపక్ష ప్రభుత్వం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. కేవలం మాటలే కాక ..చేతల ద్వారా కూడా ఆ రంగం పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు. మంగళవారం నుంచి హైదరాబాద్లో నిర్వహించబోయే ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నామనీ, అందుకనుగుణంగా మహాసభ దిశానిర్దేశం చేయనుందని ఆయన చెప్పారు. మహాసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన బిస్వాస్ .... నవతెలంగాణ ప్రతినిధి కె.ప్రియకుమార్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివి...
ప్రస్తుత విద్యారంగ దుస్థితికి కారణం ఏమంటారు?
పాలకవర్గాలు దేశంలో తమకు చవకగా పనివారు కావాలనుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దళితులు, ఆదివాసీలు, అల్పసంఖ్యాక వర్గాలు, బాలికలను విద్యకు దూరం పెట్టాలనే విధానాన్ని అవలంభిస్తున్నది. ఈ క్రమంలో మేం ఏకలవ్యుడిని చంపిన వారింకా బతికే ఉన్నందుకు సిగ్గుపడుతున్నామనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మనువాద వ్యవస్థలో ఎలా ఉండేదో ఇప్పటికీ అవే పరిస్థితులున్నాయి. ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో తీసుకొచ్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బాలికల ఉపకారవేతనాల రద్దు, యూనివర్సిటీల్లో సీట్ల తగ్గింపు, మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడం తదితర చర్యలకు కేంద్రం పూనుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడంలో భాగంగా ఉపాధ్యాయలను నియమించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో తీవ్రమైన వ్యత్యాసం చోటు చేసుకుంటున్నది. పరిశోధనా సౌకర్యాలు పెంచడం లేదు. ఉద్యోగాల కల్పన లేదు. విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేయడం ద్వారా దేశానికి భవిష్యత్తు లేకుండా చేయాలనేది వారి ఉద్దేశం.
ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మీరు ఏం చేయబోతున్నారు?
ఏ దేశానికైనా యువతే సంపద. మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ. దేశ జనాభాలో 35 ఏండ్లలోపు వారే 65 శాతం మంది ఉన్నారు. ఇదే మన దేశానికున్న సానుకూల అంశం. యువత ఐక్యంగా ఉంటే దేశం బలోపేతమవుతుంది. అందుకే దేశాన్ని బలహీనం చేసే క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ముందుగా యువతను మనవాద, కార్పొరేట్ విధానాల ఆధారంగా విభజిస్తున్నాయి. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు సముచితంగా చేస్తే అభివద్ధి ఎలా ఉంటుందనే విషయాన్ని పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఇది వరకే నిరూపించాయి. ప్రస్తుతం కేరళను చూడొచ్చు. కరోనా మహమ్మారికి ముందు, తర్వాత దేశవ్యాప్తంగా డ్రాపౌట్స్ పెరిగితే, గత ఐదేండ్లలో కేరళలో 6.5 లక్షల మంది ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు. కేరళలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక స్టడీ రూంలను ఏర్పాటు చేశారు. అక్కడ ఆధునాతన తరగతి గదులతో పాటు ప్రతి పాఠశాలలో గ్రంధాలయం, డిజిటల్ సౌకర్యాలున్నాయి. అణగారిన వర్గాల పిల్లల కోసం చేయాలనే సంకల్పం ఉంటే ఎలా చేయగలదో కేరళలో వామపక్ష ప్రభుత్వం చేసి చూపించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైతే విద్యార్థులపై యుద్ధమే చేస్తున్నది. విద్యారంగంపై బడ్జెట్ పెంచితే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర నియామకాలు పెరుగుతాయి. సౌకర్యాలు మెరుగవుతాయి. కాలక్రమంలో అది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది.
మిగతా విద్యార్థి సంఘాలను ఏ విధంగా కలుపుకుని పోతున్నారు?
విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలను ఐక్య ఉద్యమానికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసి ఐక్యపోరాటాలు సాగించింది. కరోనా మహమ్మారి రాకముందు వామపక్ష, ప్రగతిశీల విద్యార్థి ఆర్గనైజేషన్లు, యూనియన్ల వేదికలో భాగస్వామి అయింది.'ఆల్ ఇండియా ఫోరం టు పబ్లిక్ ఎడ్యుకేషన్' పోరాటంలోనూ భారత విద్యార్థి ఫెడరేషన్ క్రియాశీలకంగా వ్యవహరించింది. విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఆర్థికవేత్తలు తదితరులతో కూడిన 'జాయింట్ ఫోరం ఆఫ్ మూవ్ మెంట్ ఆన్ ఎడ్యుకేషన్' లోను పాల్గొన్నాం. ఆయా విశ్వవిద్యాలయాల్లో మిగిలిన విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తున్నాం. ఈ ఐక్యపోరాటాలను క్షేత్రస్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తున్నాం.
నూతన విద్యా విధానంపై బీజేపీయేతర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది?
నూతన జాతీయ విద్యావిధానాన్ని కేరళ వామపక్ష ప్రభుత్వంతో పాటు తమిళినాడు సర్కారు వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ వరకు బీజేపీయేతర ప్రభుత్వాలు ఆ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పాఠశాలలను మూసేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ మోడల్) తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేశాయి. ఒక విద్యార్థికి తాను చదువుకుంటున్న ప్రాంగణంలో నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకుండా చేశాయి. విద్యాసంస్థల్లో విద్యార్థి వ్యతిరేక రాజకీయాలతో నింపేశాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో అక్కడి టీఎంసీ సర్కారు విద్యార్థి ఉద్యమాన్ని ఆ పార్టీ గుండాలు, పోలీసులతో అణిచి వేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఒక్క విద్య కాషాయీకరణ తప్ప మిగిలిన అన్ని విధానాలు బీజేపీ లాగే అమలు చేస్తున్నది.
హైదరాబాద్లో నిర్వహించబోయే ఎస్ఎఫ్ఐ మహాసభ ద్వారా విద్యార్థి లోకానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు?
హిందీ ప్రభావిత ప్రాంతాల్లో పలు సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరమున్నది. వికలాంగులు, పేద వర్గాల విద్యార్థులను ప్రధానంగా దష్టి సారించనున్నాం. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బాలికలను ఎక్కువగా ఉద్యమంలో భాగస్వాములను చేస్తాం. బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్, మనువాద అనుకూల విధానంపై పోరాటం సాగిస్తాం.
మహాసభ ప్రాధాన్యత ఏమిటి?
దేశవ్యాప్తంగా విద్యారంగం సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టబడింది. దానికి ఒక దారితెన్నూ లేకుండా పోయాయి. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన సరళీకత ఆర్థిక విధానాలను మోడీ మరింత వేగంగా అమలు చేస్తున్నారు. ఆ ఫలితంగా విద్యారంగం కూడా తీవ్రమైన పరిస్థితుల్లో కూరుకుపోయింది. మున్ముందు సాధారణ ప్రజలతో పాటు మధ్యతరగతి వారు కూడా చదువుకునే పరిస్థితులుండవు. కేజీ నుంచి పీజీ వరకు, మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ లాంటి వత్తివిద్యా కోర్సుల్లో చదువుకోవాలంటే లక్షల రూపాయాలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఆయా తరగతులు విద్యకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదముంది. మహాసభ వీటిపై ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తుంది. చర్చించి తీర్మానాలు ఆమోదిస్తాం.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎలా ఉన్నది.?
అక్కడ విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఆర్టీఈ చట్ట ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది విద్యార్థులను చేర్చుకున్నప్పటికీ వారిని ద్వితీయ శ్రేణి విద్యార్థులుగానే పరిగణిస్తున్నాయి. ఈ విద్యార్థులపై అక్కడి ఉపాధ్యాయులు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విలీనం పేరుతో పాఠశాలలను మూసేశారు. బీజేపీ చేస్తున్న విద్యా కాషాయీకరణపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నోరు విప్పలేదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో నమోదు పరంగా చూస్తే ఢిల్లీలో 91 శాతంగా ఉంటే, కేరళలో 98 శాతంగా ఉంది.