Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడున్నర గంటల పాటు విచారణ
- ఈ రోజుతో ముగిసినట్టే.. అవసరమైతే మళ్లీ వస్తాం : సీబీఐ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సాక్షిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం ఆమె నివాసంలోనే సుదీర్ఘంగా విచారించారు. ఇదివరకు ఇచ్చిన సమాచారం మేరకు ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ దర్యాప్తు బృందం రెండు కార్లలో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్నది. సీబీఐ డీజీ రాఘవేంద్ర వత్స్ నేతృత్వంలో ఒక మహిళా అధికారితో సహా ఆరుగురు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. కవిత నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో విచారణ కొనసాగింది. ఆ సమయంలో కవిత ఇంట్లో కవిత వెంట ఒక న్యాయవాది తప్ప ఎవరూ ఉండకుండా వెలుపలికి పంపించి వేశారు. ఇంటి బయట భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉండగా, లోపల సీబీఐ అధికారుల విచారణ కొనసాగింది. ఆ సమయంలో భారీ సంఖ్యలో వెలుపల నాయకులు, కార్యకర్తలు రాగా వంద గజాల దూరంలోనే బారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇది వరకే నిందితుడు అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను అధికారులు విచారించినట్టు తెలిసింది. అమిత్ అరోరాకు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీఆర్పీసీలోని 160 సెక్షన్ ఆధారంగా కేవలం సాక్షిగానే ఆమెను విచారిస్తున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ డీజీ రాఘవేంద్ర ఒక ప్రశ్నావళిని రూపొందించుకొని దాని ప్రకారమే కవితను విచారించినట్టు సమాచారం. ముఖ్యంగా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఈ కేసులో నిందితుడైన శరత్ చంద్రా రెడ్డితో ఆమెకు పరిచయాలు ఉన్నాయా? అంటూ కూడా విచారించినట్టు తెలిసింది. అలాగే, అమిత్ అరోరాను విచారించిన సమయంలో ఏవైతే సమాచారాన్ని అతను కవితకు సంబంధించి ఇచ్చాడో.. వాటిని కూడా విచారణ సమయంలో కవిత నుంచి వివరాలు రాబట్టడానికి సీబీఐ అధికారులు ప్రయత్నించారని తెలిసింది. ఇందులో పలు ప్రశ్నలకు ఆమె తనకు తెలిసిన విషయాల్లో సమాచారమిస్తూ, తెలియని విషయాల్లో తెలియదంటూ స్పష్టంగా వెల్లడించినట్టు సమాచారం. ఉయదం 11 గంటల నుంచి సాయంత్రం 6.60 గంటల వరకు, మధ్యలో 2 గంటలకు 30 నిమిషాల పాటు భోజన విరామమిచ్చి తమ విచారణ ప్రక్రియను సీబీఐ అధికారులు కొనసాగించారు. సరిగ్గా 6.60 గంటల ప్రాంతంలో వెలుపలికి వచ్చిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు విచారణ ముగిసనట్టేననీ, ఇక ముందు అవసరమైతే విచారణకు వస్తామని భారీ బందోబస్తు నడుమ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా, కవిత నుంచి సాక్షిగా సేకరించిన సమాచారాన్ని ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూసి తదుపరి కార్యాచరణకు సబీఐ దిగే అవకాశమున్నదని తెలుస్తున్నది. కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నంత సేపు ఇంటి వెలుపల బారీకేడ్ల వెనకాల భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి లకు చెందిన కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. సాధారణంగా సీబీఐ ఎవరినైనా విచారించే సమయంలో సాయంత్రం ఐదు గంటల లోగా ఆ ప్రక్రియను ముగిస్తుంది. కానీ, కవితను విచారించిన సందర్భంలో ఆ నిర్ణీత సమయం దాటి గంట సేపటికి పైగా విచారణ కొనసాగటం పట్ల బయట వేచి ఉన్న నాయకులు, కార్యకర్తలలో కొంత ఆందోళన, అసహనం నెలకొన్నది. ఈ సందర్భంగా అక్కడున్న ఎమ్మెల్యే గాంధీ, దాసోజు శ్రవణ్ లు మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ ని తమ నాయకురాలుపై ప్రయోగించిందనీ, ఈ కుట్ర నుంచి తప్పకుండా బయట పడతామని తెలిపారు. జాతీయ స్థాయిలో పార్టీని ప్రకటించిన తర్వాత దానిని నిలువరించాలనే కుట్రతోనే ఇలాంటి కుయుక్తులకు బీజేపీ పాల్పడుతున్నదనీ, దీనిని ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు. కాగా, విచారణ ముగిసిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు లోనికి వెళ్లి కవితను కలిశారు. అనంతరం ఆమె వెలుపలికి నవ్వుతూ వచ్చి అక్కడ భారీ సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలకు అభివాదం చేశారు. తర్వాత మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవటానికి బయలుదేరి వెళ్లారు.
91 సీఆర్పీసీ కింద కవితకు మరో నోటీసు ఇచ్చిన సీబీఐ
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు 91 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు మరో నోటీసునిచ్చారు. 91 సీఆర్పీసీ ప్రకారం ఈ కేసుకు సంబంధించిన తన వద్ద ఉన్న ఏదేనీ మెటీరియల్ ఆధారాన్ని లేదా డాక్యుమెంట్లను కవిత సీబీఐ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, సీబీఐ అధికారులు కవితను సాక్షి కింద విచారించిన సందర్భంలో తేలిన అంశాలను బట్టి ఈ నోటీసులిచ్చారా? లేక ఇదివరకే ఇతర నిందితులను విచారించటం ద్వారా వెల్లడైన అంశాలను బట్టి ఇచ్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.