Authorization
Fri May 02, 2025 06:08:33 pm
- తొలగించిన 43 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని..
- మంత్రి కేటీఆర్‌కు తమ్మినేని బహిరంగ లేఖ
- లేఖను విడుదల చేసిన సీఐటీయూ యాదాద్రి జిల్లా అధ్యక్షకార్యదర్శులు
నవతెలంగాణ-చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ లిమిటెడ్ కంపెనీ అక్రమ లే ఆఫ్‌ను ఎత్తివేసి తొలగించిన 43 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం మంత్రి కేటీఆర్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగ లేఖ అందజేశారు. ఈ లేఖ పత్రాలను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని గతంలో కార్మికశాఖ అధికారుల సమక్షంలో యాజమాన్యం, యూనియన్ నాయకుల మధ్య 16సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 22, 2022 నుంచి కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. స్పందించిన కార్మికశాఖ మంత్రి సీహెచ్.మల్లారెడ్డి పరిశ్రమ వద్దకు వచ్చి లేబర్ అధికారుల సమక్షంలో యూనియన్ నాయకత్వం, యాజమాన్యంతో చర్చలు జరుపగా రూ.3200 వేతన ఒప్పందంతోపాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని యాజమాన్యం ఒప్పుకుందన్నారు. అదే రోజు మంత్రి మల్లారెడ్డి, కంపెనీ ఎమ్డీ సమ్మె శిబిరం వద్దకు వచ్చి చర్చల వివరాలను కార్మికులకు వివరించి సమ్మె విరమింపచేశారని తెలిపారు. మంత్రి ముందు జరిగిన ఒప్పందాన్ని కూడా కంపెనీ యాజమాన్యం లెక్కచేయకుండా అక్టోబర్ 13, 2022 నుంచి కార్మికులను డ్యూటీలోకి రానీయకపోవడంతో ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అక్టోబర్ 27, 2022న కార్మికశాఖ మంత్రి మళ్లీ పరిశ్రమ వద్దకు వచ్చి యాజమాన్యంతో మాట్లాడి కార్మికులందరిని డ్యూటీలోకి పంపించినట్టు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత నవంబర్ 5 నుంచి 43 మంది కార్మికులను మళ్లీ డ్యూటీలోకి అనుమతించడం లేదని మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే స్పందించాలని కోరుతూ అక్రమ లే ఆఫ్‌ను ఎత్తివేయడంతోపాటు 43 మంది కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకొని కోరారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జరిగిన వేతన ఒప్పందంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ్మినేని వీరభద్రం బహిరంగ లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు గడ్డం ఈశ్వర్, తుర్కపల్లి సురేందర్, సుబ్బూరు సత్యనారాయణ, గొరిగె సోములు, కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎమ్‌డి.పాషా, కూరెళ్ల రాములు పాల్గొన్నారు.