Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికలో వ్యవహర శైలే ప్రతిబంధకం
- తనకు తానే పార్టీకి దూరం
- బీజేపీలో చేరే యోచనలో వెంకన్న
- ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటానని ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంశం మరోసారి చర్చనీయాంశమవుతున్నది. పార్టీ పదవుల్లో చోటు దక్కకపోవడంతో చర్చ జోరందుకున్నది. పార్టీలో ఉంటాడా? ఇతర పార్టీల్లో చేరుతారా? పార్టీని వీడితే ముహుర్తమేంటి? తదితర విషయాలు పార్టీ శ్రేణులను తొలిచేస్తున్నాయి. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఆయన నర్మగర్భంగా మాట్లాడిన అంశాలు అనుమానస్పదంగా ఉన్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ఆయన ప్రతికూల నిర్ణయం తీసుకుంటారనే సంకేతమిచ్చారు.
మాస్ లీడర్‌గా పేరొందిన కోమటిరెడ్డికి పార్టీ ఉన్నత పదవుల్లో చోటు దక్కపోవడంతో ఆయనపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉందనే సంకేతం ఇచ్చింది. దీనికంతటికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంకృతాపరాధమని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయన...మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో పార్టీలో ఆయన పతనం మొదలైందని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారనేది ఏఐసీసీ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. దీంతోనే ఆయనకు పార్టీ పదవుల్లో చోటు కల్పించలేదనేది నగసత్యం. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన ఎన్నిక ముగిశాక కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చాక ఆయనకు క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఏఐసీసీ షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చినట్టు లీకులిచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానంపై ఏఐసీసీ సంతృప్తి చెందకపోవడంతోనే ఆయనకు పార్టీ పదవుల్లో స్థానం దక్కలేదని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే గత కొంత కాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు, పార్టీ ప్రయోజనాల కంటే తమ్ముడిని గెలిపించాలనే తాపత్రాయం, రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు...ఇవన్నీ ఆయనకు ప్రతిబంధ కంగా మారాయి. దీంతో పార్టీ ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నట్టు కనపడుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 'ఇవాళ కాంగ్రెస్ కండువా వేసుకున్న...రేపు కండువా మారవచ్చు...ఎవరికి తెలుసు' అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో దుమారం లేపుతున్నాయి. మంత్రి పదవిని చెప్పుతో సమానంగా చూశాను... పార్టీ పదవో లెక్కా అంటూ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దారిలో నడుస్తారనే టాక్ వినిపిస్తున్నది.