Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ప్రశ్నించిన పొన్నం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని బీజేపీ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తుంటారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవటంలేదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒక్కటే...' అని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రయివేటీకరణ చేస్తున్నదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నదన్నారు. వాస్తవంగా సింగరేణిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని పొన్నం స్పష్టం చేశారు. తాడిచెర్ల గనుల ప్రయివేటీకరణను రద్దుచేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్కడి బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏండ్ల పాటు అప్పజెప్పడంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ, ఈడీకి, బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.
కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే
రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు గనుల కేటాయింపుపై దర్యాప్తు సంస్థలతో విచారణకు అదేశించాలని సవాల్ చేశారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రయివేటీకరణ వద్దన్న టీఆర్ఎస్ ఇప్పుడెలా కేటాయిస్తున్నదని ప్రశ్నించారు.