Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎన్‌జే ఆస్పత్రిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే వారంలో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 300 పడకలతో కూడిన కొత్త బ్లాక్‌ను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మంగళవారం హైదరా బాద్ నుంచి ఆయన ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రితో పాటు నిమ్స్‌పై జూమ్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితో కలుపుకుని క్యాన్సర్ చికిత్స కోసం 750 పడకలు అందు బాటులోకి వస్తాయని తెలిపారు. పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి ఎక్కువ మందికి సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా నిర్వహించే క్యాంపుల సంఖ్యను పెంచడంతో పాటు వాటిని మారుమూల ప్రాంతాల్లోనూ నిర్వహించాలని ఆదేశిం చారు. రోగులు, వారి సంబంధీకులతో సెక్యూరిటీ, నాల్గవ తరగతి ఉద్యోగులు గౌరవంగా మెలగాలని సూచించారు. పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరముందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని నిమ్స్ జెనిటిక్స్ విభాగంతోపాటు ప్రసూతి ఆరోగ్య సంయుక్త సంచాలకులను ఆదేశించారు. నిమ్స్‌లో ఓపీ పెరిగిన రీతిలో కౌంటర్లను పెంచాలనీ, ఐఎండీలో బెడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. అవయవదానంపై అవగాహన పెంచాలనీ, అవసరమైతే బ్రెయిన్ డెడ్ అయిన కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. తాను కూడా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించేం దుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డయాలసిస్ సెంటర్లను నిమ్స్ నుంచి పర్యవేక్షించాలని సూచించారు.
జడ్జి శాలినికి మంత్రి శుభాకాంక్షలు
హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆర్మూర్ న్యాయస్థానం జూని యర్ సివిల్ జడ్జి శాలినికి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఉత్తమ వైద్య సేవలందుతున్నాయని పేర్కొన్నారు.