Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలి
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలి : వ్యకాస జిల్లా ప్రథమ మహాసభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వమే పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపు ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా ప్రథమ మహాసభ గుమ్మడిరాజుల రాములు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముందుగా హసన్పర్తి బస్టాండులోని అంబేద్కర్ విగ్రహానికి, పేదల కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాసభ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం భారతదేశంలో ప్రతి పౌరునికి జీవించే హక్కు కల్పించిందన్నారు. ఎర్ర జెండా నీడలో పేదలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, వారి హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, నివాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. పేదలు ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలు, జాగాలకు పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసేలా మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టం కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, పట్టణ పేదలకూ ఉపాధి హామీని విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందన్నారు. దళితులు, మహిళలు, గిరిజనుల పైన హత్యలు, లైంగికదాడులు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణలో ఘోరంగా విఫలమైందని విమర్శిం చారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిం చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్బంధాన్ని ప్రయోగించి పడగొట్టే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ దళిత బంధు ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతన జీవోని సవరించి రోజు కూలి రూ.600 ప్రకటించాలని డిమాండ్ చేశారు. 57 ఏండ్లు పైబడిన పేదలకు నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని, ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి 14 రకాల నిత్యవసర సరుకులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎర్ర జెండా నీడలోనే పేద ప్రజల హక్కులు కాపాడబడుతాయని, పేదల పక్షాన పోరాటాలు చేస్తున్న ఎర్రజెండాను ప్రజలు ఆదరించి అధికారం అందజేయాలని కోరారు. మహాసభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, నాయకులు వెదునూరి వెంకటరాజం, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బొట్ల చక్రపాణి, జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, సతీష్, అశోక్, పెండ్యాల రవి, రాఘవులు, రజిత, అంబాల స్వరూప, తదితరులు పాల్గొన్నారు.