Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎం,ఈసీఎఎన్ఎం, ఆర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏఎన్ఎంలపై పని ఒత్తిడిని తగ్గించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ పసియోద్దీన్, కె యాదానాయక్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పీహెచ్‌సీకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలనీ, ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారంకోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎం ఉద్యోగులు ఏకకాలంలో 32 రకాల రికార్డులు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్లో నమోదు చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మొదటి ఏఎన్ఎంలు 30 ఏండ్లుగా పనిచేస్తున్నా ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్ అవడం బాధాకరమని తెలిపారు. ప్రతి రెండు సబ్ సెంటర్లకు ఒక హెల్త్ సూపర్వైజర్ పోస్టును క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15ఏండ్లుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలకు 8,9,10 పీఆర్సీల ప్రకారం బేసిక్‌పే ఇచ్చారని తెలిపారు. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో తొలి పీఆర్సీ బేసిక్ పే ఇవ్వకుండా 30శాతం వేతనాలు పెంచడం వల్ల రెండవ ఏఎన్ఎంలు ప్రతినెలా రూ.5 నష్టపోతున్నారని పేర్కొన్నారు. పనిచేస్తున్న వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.