Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైసలిచ్చి అధికారంలోకి వచ్చేటోళ్లం కాదు
- పేదోళ్ల హక్కుల కోసం పోరాడేటోళ్లు కమ్యూనిస్టులు
- కేరళలో రోజుకూలీ రూ.836 ఇస్తున్నాం
- గుజరాత్లో కేవలం 236 మాత్రమే..
- మోడీపాలన జాతీయ విపత్తు: కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి
సిద్దిపేట నుంచి అచ్చిన ప్రశాంత్
'బూర్జువా పార్టీల లాగా ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ప్రజలకు పైసలు పంచి అధికారంలోకి వచ్చేటోళ్లం కాదు. కార్పొరేట్ల కోసం పనిచేసేటోళ్లం కాదు. పేదోళ్ల హక్కుల కోసం పోరాడేటోళ్లం. ప్రజల మనస్సుతో గెలిచేటోళ్లం. కమ్యూనిస్టులకు, ఇతర పార్టీలకు ఉన్న తేడా అదే' అని కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని సున్నం రాజయ్య ప్రాంగణం(డిగ్రీ కళాశాల మైదానం)లో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల ముగింపు సందర్భంగా బహరంగ సభ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేరళలోని తమ ఎల్డీఎఫ్ ప్రభుత్వం రోజుకూలీ రూ.836 ఇస్తున్నదనీ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇవ్వడం లేదని చెప్పారు. దేశానికి మోడల్ అని మోడీ చెబుతున్న గుజరాత్లో ఇస్తున్నది కేవలం రూ.236 మాత్రమేనని నొక్కిచెప్పారు. దేశంలో అచ్చేదిన్ పేదలకు, కార్మికులకు రాలేదనీ, కార్పొరేట్లకు వచ్చిందని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా, మిడ్డేమీల్స్ పథకంలో పనిచేస్తున్న కోట్లాది కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నార న్నారు.
కరళలో అంగన్వాడీ వర్కర్లకు రూ.12500 ఇస్తుంటే ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.4,500 మాత్రమే ఇస్తున్నారని ఆ రాష్ట్ర ఎంపీ లోక్‌సభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. స్కీం వర్కర్లను కనీసం కార్మికులుగా గుర్తించని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సబ్‌కాసాత్ సబ్కా వికాస్ అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికకోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నంలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ తీరు వల్ల దేశంలో కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నానీ, వారిని ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కార్పొరేట్ మీడియా అంతా మోడీ చుట్టూ చేరి అబద్ధాలను ప్రచారం చేస్తున్నదనీ, ప్రజా సమస్యలను, వస్తున్న పోరాటాలను ఎక్కడా చూపట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైల్వే, ఇన్సూరెన్స్, తదితర సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ కార్పొరేట్లకు 35 ఏండ్లకు లీజుకిస్తున్న తీరును వివరించారు. కరోనా కాలంలో ప్రజలు ఆక్సిజన్ అందక చస్తుంటే మోడీ సర్కారు పట్టించుకోకుండా కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నదని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణ వేగం చేశారనీ, ఇప్పుడు విద్యుత్‌ను కూడా ప్రయివేటుపరం చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై వస్తున్న పోరాటాలను అణచివేసేందుకు కులం, మతం పేరిట విద్వేషాలను ఆర్ఎస్ఎస్ రెచ్చగొడుతున్నదని తెలిపారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులపై దాడులు తీవ్రతరం అయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో వస్తున్న ప్రజా పోరాటాలను మీడియా ఏమాత్రం చూపట్లేదన్నారు.
ప్రతి రంగంలోనూ కేరళ ముందువరుసలోనే..
కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతి రంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని శివన్కుట్టి చెప్పారు. కరోనా కాలంలో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందజేసిన చరిత్ర ఉందన్నారు. విద్యా, వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. అసంఘటిత కార్మికుల కోసం ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి 29 రకాల వెల్ఫేర్ స్కీమ్‌లను అమలు చేస్తున్నామని చెప్పారు. వారికోసం ప్రత్యేకంగా వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేసి 89 రంగాల కార్మికులకు లబ్ది చేకూరుస్తున్నామని చెప్పారు. అందుకే కేరళలో ప్రజలు, కార్మికులు వామపక్షాలకు అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా ప్రతి ఐదేండ్లకోసారి వేతన సవరణ జీవోలు విడుదల చేస్తున్నామనాన్నరు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తుంటే తాము మాత్రం వాటిని కాపాడుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూస్తాన్ పేపర్ మిల్లును ప్రయివేటు అప్పగించాలని చూస్తే అడ్డుకుని ఎల్డీఎఫ్ ప్రభుత్వం టేకోవర్ చేసుకున్నదన్నారు. ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయట్లేదన్నారు. మిగతా ప్రభుత్వాలకు, కమ్యూనిస్టులకు ఉన్న తేడా అదేనని చెప్పారు.
అతిథి కార్మికుల కోసం 14 జిల్లాలోనూ ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేశామన్నారు. సెక్యూలరిజాన్ని కాపాడే క్రమంలో కేరళ ముందువరుసలో ఉందన్నారు. రాష్ట్రంలోని మూడులక్షల మంది పేదలకు ప్రాధాన్యతాక్రమంలో ఇండ్లు ఇచ్చామని చెప్పారు. విద్యా విధానంలో ఐటెక్ విజన్‌తో దూసుకుపోతున్నామనీ, ప్రతి ఇంటికీ నెట్ సౌకర్యాన్ని కల్పించిన ఘనత తమదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడుతున్న రాష్ట్రాల్లో కేరళ ముందువరుసలో ఉందన్నారు. కార్మికులంతా సంఘటితమై బీజేపీ అనుసరి స్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలను, మతోన్మాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రైతు పోరాట స్ఫూర్తితో కార్మికోద్యమం
సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నెలలు తరబడి పోరాటం చేసి వాటిని వెనక్కి తిప్పికొట్టిన చరిత్ర రైతుల పోరాటానికి ఉందనీ, అదే స్ఫూర్తితో కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులంతా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. ఏపిల్ర్ ఐదో తేదీన ఢిల్లీలో తలపెట్టిన కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల ఐక్య ప్రదర్శన(పార్లమెంట్ మార్చ్)ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో మూడు పెద్ద సమ్మెలు జయప్రదం అయ్యాయని చెప్పారు. మోడీ దేశ ఖజానాను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల ఫలితంగా దేశంలో పోరాటాలు తీవ్రం అవుతున్నాయన్నారు. అయితే, వాటిని సంఘటిత పర్చాల్సిన బాధ్యత సీఐటీయూపై ఉందన్నారు.
లేబర్కోడ్లు..కార్మికవర్గానికి ఉరితాళ్లు : ఎం.సాయిబాబు
కేంద్రంలోని బీజేపీ తీసుకొస్తున్న లేబర్కోడ్లు కార్మికవర్గానికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యపోరాటాలకు సీఐటీయూ బాట వేస్తున్న దన్నారు. మోడీ సర్కారు వచ్చాక నిత్యావసరాల ధరలు పేదలు కొనలేని స్థాయికి ఎగబాకాయని చెబుతూ పలు ఉదహరణలు చెప్పారు.
కార్మికుల ఆదాయాలు పెంచకుండా దేశ ఆర్థికవృద్ది ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. సంపద సృష్టికర్తలైన కష్టజీవులపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు పన్నుల రాయితీలు, రుణాల మాఫీలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జీవోలను సవరించకుండా జాప్యం చేయడం తగదన్నారు. కేంద్రంలో కొట్లాడుతామని మాటల్లో చెప్పడం కాదనీ, బీజేపీ విధానాలను రోడ్లెకి ప్రతిఘటించా లని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఆర్టీసీ, ప్రజారవాణా పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సీఎం కేసీఆర్ రెండు ఎన్నికల సందర్భంగా మ్యాని ఫెస్టోల్లో రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. వారికి కనీసం గూడు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు.
వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇస్తామన్న హామీని నేటికీ నెరవేర్చలేదన్నారు. దాని ఫలితంగానే రాష్ట్రంలో 44 చోట్ల కార్మికులు ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. అయితే, వారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగుతున్నదని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ చుట్టూ వందల ఎకరాలను పారి శ్రామికవేత్తలకు అప్పణంగా కట్టబెడుతున్నారని విమర్శిం చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ మాట్లాడుతూ.. మోడీ సర్కారు ఇస్తాన్న ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, పేదలకు పంచుతానన్న నల్లధనం ఏమైందని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం ముసుగేసుకుని ప్రజలు తినే తిండిపైనా దాడి చేస్తున్నదని విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లాడుతూ..జనవరి ఆరో తేదీన జరిగే స్కీం వర్కర్ల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు నిధులు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లను పెట్టుకోకుండా మోడీ సర్కారు అడ్డుకుంటున్నదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పెండింగ్‌లోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షు లు కె హేమలత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్, కె.వెంకటేశ్వరరావు, వీఎస్‌రావు, వీరారెడ్డి, కె.ఈశ్వర్రావు, టి.రాజారెడ్డి, కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎం.పద్మశ్రీ, ఏ.ముత్యంరావు, జె.చంద్రశేఖర్, బి.మధు, ఎం.వెంకటేశ్, బి.మల్లేశ్, ఏజే.రమేశ్, రాగుల రమేశ్, పి.శ్రీకాంత్, కూరపాటి రమేశ్, కె.గోపాలస్వామి, కోశాధికారి వంగూరు రాములు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, రైతుసంఘం నాయకులు ఆముదాల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.