Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో సమ్మె చేసినట్టే తడాఖా చూపుతాం : ఏఎన్ఎంల ధర్నాలో కె.యాదనాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకుంటే గతంలో సమ్మె చేసినట్టే.... జనవరి 18 నుంచి మరో పోరాటం నిర్వహిస్తామని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కోఠిలోని కుటుంబ సంక్షేమ కార్యాలయం సమీపంలో రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో ఏఎన్ఎంలు 30 ఏండ్లుగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లైనా ఇంకా సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. రెగ్యులర్ ఏఎన్ఎం ఖాళీలను భర్తీ చేయాలనీ, పదోన్నతులు కల్పించాలనీ, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం తన హామీని నిలబెట్టుకోవాలనీ, అవసరమైతే చట్టసవరణ చేయాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో రెగ్యులరైజ్ చేశారనీ, అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. పాండమిక్, ఎండమిక్ చట్టాల ఆధారంగా రెగ్యులరైజ్ చేయవచ్చని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంలను తమ చదువు, జాబ్ ఛార్ట్ ప్రకారం మాతా,శిశు సేవలకే పరిమితం చేయాలని కోరారు. యాప్‌లు మీద యాప్‌లతో ఆన్లైన్ పేరుతో వారిపై పని భారం పెంచడం సరికాదన్నారు.
యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఎన్ఎంలను సమస్యలను పరిష్కరించుకుంటే ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు ఇంటితో పాటు ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో డాక్టర్లను రెగ్యులర్ చేసినట్టుగానే ఏఎన్ఎంలను కూడా చేయాలని డిమాండ్ చేశారు. జీ.వో.నెంబర్ 16 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. వైద్యవిధాన పరిషత్ విభాగంలో జీ.వో.నెంబర్ 317 అమలు చేయాలని కోరారు. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్, రాష్ట్ర కోశాధికారి ఏ.కవిత, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వి.విజయ వర్ధన్ రాజు, నవీన్ కుమార్, బి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మీనా, కృష్ణవేణి, సుగుణ, విజయలక్ష్మి, పుష్పలత, హైమావతి, జయమ్మ, అరుణ, మంజుల, సునీత, ప్రభావతి, నర్మదా, సరోజ తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ హామీ....
'నా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను. మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తాను. ఆయుష్మాన్ భారత్. ఈకేవైసీ తదితర కార్యక్రమాలకు చెందిన పనులు ఏఎన్ఎంలు చేయకుండా ఉండేలా డీఎంహెచ్‌వోలకు ఉత్తర్వులు జారీ చేస్తాను. మెటర్నిటీ లీవులు, ఇతర అలవెన్సులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల కు పీఆర్సీ ఎరియర్స్ వెంటనే విడుదల చేస్తాం....' అని కమిషనర్ శ్వేతా మహంతి హామీలిచ్చారు.