Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకావిష్కరణలో శ్రీకాంత్ మిశ్రా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దినపత్రికల్లో, ఎలక్ట్రానిక్ చానళ్లలో మనం చూస్తున్న, చదువుతున్న వార్తలు, వ్యాఖ్యానాలు సామాన్య ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నారు. ఒక్కో పత్రిక, టీవీ ఛానల్ యాజమాన్యం తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రముఖమైన వార్తలను, వాస్తవాలను సరైన కోణంలో చూపించకుండా మరుగున పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రజాకోణంలో ఒక కార్మిక వర్గ దక్పథంతో ఒక వార్తను ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని రచయిత తన పుస్తకంలో చక్కగా వివరించారని కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్లోని యూనియర్ కార్యాలయంలో 'అండర్స్టాండింగ్ ది అన్ టోల్డ్' అనే పుస్తకాన్ని మిశ్రా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి తిరుపతయ్య రచించారు. అనంతరం ఐసీఈయు అధ్యక్షులు ఎల్.మద్దిలేటి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కె వేణుగోపాల్ పుస్తక పరిచయం చేస్తూ నేటి కాలంలో యువతలోనే కాక సామాన్య ప్రజలో కూడా పుస్తక పఠనం చాలా తగ్గిపోయిందన్నారు. ప్రస్తుత మొబైల్ యుగంలో విషయాలను అర్థం చేసుకునే తీరిక, ఓపిక అందరికీ ఉండడం లేదని చెప్పారు.టీవీలు, మొబైల్స్ ద్వారా సమాచారం పెద్ద ఎత్తున మన ఇండ్లలోకి కుమ్మరించబడుతోందని తెలిపారు. దాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకున్నప్పుడే ప్రతి విషయాన్ని ప్రజలు చరిత్ర నిర్మాతలుగా తమ రాజకీయ నిర్ణయాలను తెలియజేస్తారని తెలిపారు. ఈ ప్రయత్నం అందుకనుగుణంగా పుస్తకాన్ని రాసిన రచయితను మనస్పూర్తిగా అభినందించారు. నవతెలంగాణ ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్ మాట్లాడుతూ అనేక పుస్తకాలు వెలువడుతున్నప్పటికీీ అత్యంత తక్కువ నిడివితో ఒక వ్యాసాన్ని రచించడం, అందులోనూ ప్రతిరోజు ఒక అంశంపై వ్యాసాన్ని తీసుకురావడం అంత సులభమైన పని కాదని చెప్పారు. నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి మాట్లాడుతూ ఒక్క పేజీలోనే ఒక అంశానికి సంబంధించిన ఇతివృత్తమంతా బోధపడేలా ఉన్న ఈ వ్యాస సంకలనాలను ముద్రించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రమేష్ మాట్లాడుతూ విమర్శనాత్మకమైన ఉపన్యాసాలను రచనలను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సహించే స్థితిలో లేదన్నారు. ధైర్యం చేసి అనేక అంశాలపై కార్మిక వర్గ దృక్పథంతో ఉద్యోగులను ప్రజలను చైతన్యపరిచేలా రచనా వ్యాసంగాన్ని పూర్తి చేసిన రచయితను అభినందించారు. సంఘం సైద్ధాంతిక ఆలోచనలను బహిర్గత పరిచే ఆ పుస్తకంలోని ప్రతి అంశాన్ని చదవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఈఏ కోశాధికారి బి ఎస్ రవి తదితర యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.