Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నెలనెలా విద్యుత్ చార్జీలను సవరించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనలను సవరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ విమర్శించారు. ఇది వినియోగదారులను ప్రత్యక్షంగా దోపిడీ చేయడమేనని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు, విద్యుత్ కొనుగోలు ధరలు పెరుగుతున్నాయన్న సాకుతో ఈ భారాన్ని నెలవారీగా వినియోగదారులపై వేసేలా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని తెలిపారు. ఇంధనం, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు సర్ఛార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేయడానికి అయ్యేఖర్చు అనీ, ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లులో కలపాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రుత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలు వారి ఆదాయంలో ఎక్కువ వాటాను విద్యుత్ బిల్లులపై ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. నెలనెలా విద్యుత్ చార్జీల సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బలమైన ఉద్యమాలు నిర్వహించి ఈ దోపిడీని అడ్డుకుంటామని హెచ్చరించారు.