Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణవాదాన్ని రక్షించుకోవాలి :
ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణవాదాన్ని రక్షించుకునేందుకు తెలంగాణవాదులంతా ఐక్యం కావాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని నాంపల్లిలో గల టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ను... బీఆర్ఎస్గా మార్చాక ఎటుపోవాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తన అస్థిత్వాన్నే తప్ప తెలంగాణ అస్థిత్వాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు చేసే వారిని అరెస్టు చేసి ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను కాపాడుకుంటామనీ, టీజేఎస్ బలోపేతమవుతుందనీ, 119 అసెంబ్లీ స్థానాలే తమ లక్ష్యమని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలనీ, అవి ఇంకా నెరవేరలేదని చెప్పారు. జనవరి 30న ఢిల్లీలో సదస్సు, 31న విభజన హామీలపై ఆందోళన నిర్వహించి విభజన హామీలు, చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భైరి రమేశ్, నిజ్జన రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.