Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాలెండర్, డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులకు సిద్దం కావాలనీ, అందుకు సిద్ధమైతే వారంలో పదోన్నతులు ఇచ్చే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన వ్యవసాయ డైరీ, క్యాలెండర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యోగులతో నాకున్న బంధమే తెలంగాణ బంధమన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆఖరున ఉన్న వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాల తెలంగాణ ప్రాంతం... అదే కేంద్రం పక్క రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుందని తెలిపారు. నల్లచట్టాలతో రైతులు ఉసురు పోసుకున్న బీజేపీ...తెలంగాణ రైతులు వ్యవసాయ కల్లాలు నిర్మించుకుంటే పైసలు వెనక్కు ఇవ్వాలంటూ ఆదేశిస్తున్నదని విమర్శించారు. అదే పక్క రాష్ట్రంలో కల్లాలు నిర్మించి చేపలు ఎండబెట్టుకుంటే సరే అని చెబుతున్నదని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం, పాడి, పశుసంపద, ఆయిల్ ఫామ్ ప్రోత్సహించేలా వ్యవసాయ అధికారులు కషి చేయాలని కోరారు. ఉద్యోగుల సంఘం చైర్మెన్ కపాకర్ రెడ్డి, వైస్ చైర్మెన్ సత్యనారాయణ, అధ్యక్షురాలు అనురాధ, వ్యవసాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో పూర్వ వైద్యవిద్యార్థులు భాగస్వాములు కావాలి
ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఎన్నారై పూర్వ వైద్య విద్యార్థులు భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో బెజ్జంకి హన్మంతుతో పాటు అమెరికాకు చెందిన 11 మంది ఎన్నారై డాక్టర్ల బృందం మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఎన్నారై డాక్టర్లు అందించే సేవలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో టిమ్స్, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హన్మంతు ఈ సందర్భంగా డాక్టర్లను మంత్రికి పరిచయం చేశారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి)లో 80 వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ అలుమ్ని ఆఫ్ అమెరికా (ఒజీకె టీఎంఏ)లో 20 వేల మంది ఉన్నారని చెప్పారు. అక్కడి నుంచి వైద్య విద్యార్థులకు రిమోట్ లెక్చర్లు ఇచ్చే అంశంపై వారు చర్చించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ విభాగాల్లో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలనీ, సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు.