Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ : టీఎన్ఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆయుష్మాన్ భారత్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 1,365 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను భర్తీ చేస్తున్నదని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) విమర్శించింది. ఈ మేరకు బుధవారం టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి ధనుంజరు ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులను బీ.యస్సీ (నర్సింగ్) లేదా జీఎన్ఎం నర్సింగ్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాల్సి ఉండగా, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ అభ్యర్థులకు అవకాశం కల్పించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులోనూ ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి నేరుగా పోస్టింగ్ ఇస్తూ, బీఏఎంఎస్ అభ్యర్థులకు ఎంపిక తర్వాత ఆరు నెలల బ్రిడ్జి కోర్సు (సర్టిఫికేట్ ప్రోగ్రాం ఇన్ కమ్యూనిటీ హెల్త్- సీపీసీహెచ్) చేసేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. నర్సులకు మాత్రం రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలో లేని ఈ కోర్సును ముందే పూర్తి చేయాలని షరతు విధించి ఎంపిక కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. కేవలం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నదనీ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇస్తున్నదని వివరించారు. దీంతో నర్సులు ఎంపికకు ముందే ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పారు. దీనికి ఎంఎల్హెచ్ పీ పోస్టుకు ఎంపికైన ఎంబీబీఎస్, బీఏఎంఎస్ అభ్యర్థులకు నెలకు రూ.40 వేలు, బీ.యస్సీ (నర్సింగ్) లేదా జీఎన్ఎం అభ్యర్థులకు రూ.29 వేలుగా నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టును బట్టి వేతనం చెల్లిస్తారా? లేక అర్హతలను బట్టి చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ నర్సుల ఆవేదనను అర్థం చేసుకుని ఎంఎల్హెచ్పీ పోస్టులను అర్హులైన వారితోనే భర్తీ చేయాలని కోరారు. ఎంపికైన తర్వాత బ్రిడ్జి కోర్సు చేసేందుకు అవకాశం కల్పించాలనీ, అందరికి ఒకే రకమైన వేతనం నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.