Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (నిమ్స్)లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖ సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నేరుగా నియామకాలు చేపట్టేందుకు సర్కారు అనుమతించింది. నిమ్స్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని సంప్రదించి లోకల్ క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలతో భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని జీవోలో రామకృష్ణారావు కోరారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
సీహెచ్‌సీ పడకల పెంపునకు అనుమతి
జగిత్యాల జిల్లా, ధర్మపురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్‌గ్రెడేషన్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతమున్న పడకల సంఖ్యను 30 బెడ్ల నుంచి 50 బెడ్లకు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను ఆదేశించారు.