Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు ఉపరితల గనుల సామర్థ్యం పెంచాలి
సమీక్షా సమావేశంలో సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒడిశా లోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలనీ, దీనికోసం నిర్ణీత కాలపరిమితితో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సంస్థలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై బుధవారంనాడాయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న ఐదేండ్లలో చేపట్టే 10 ప్రాజెక్టులపై చర్చించారు. ఈ ఏడాది కనీసం నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలంటూ కార్యాచరణను నిర్దేశించారు. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్‌లో ఫిబ్రవరి నుంచి ఓవర్ బర్డెన్ తొలగింపు మొదలు పెట్టి, మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పారు. కొత్తగూడెంలోని వీకే కోల్‌మైన్‌లో ఈ ఏడాది జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి ఉపరితల గని, ఇల్లందు ఏరియా జేకే ఓసీ విస్తరణ (రొంపేడు) గనుల్లో జులై నుంచి ఉత్పత్తికి సన్నాహాలు చేయాలని చెప్పారు. అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు ఖరారు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాదే బెల్లంపల్లి ఏరియా ఎంవీకే ఓసీ గనుల ప్రారంభానికి అనుమతుల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఇటీవలే ప్రారంభించిన జీడీకే కోల్ మైన్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు ఎస్. చంద్రశేఖర్, ఎన్. బలరాం, డి. సత్యనారాయణరావు, సలహాదారులు డి.ఎన్.ప్రసాద్, సురేంద్ర పాండే, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్ తదితరులు పాల్గొన్నారు.
9 నెలల్లో రూ.23,225 కోట్ల టర్నోవర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9నెలల్లో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించినట్టు సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికి 23 శాతం వృద్ధి సాధించామన్నారు. మార్చి నెలాఖరు నాటికి సంస్థ టర్నోవర్ 34వేల కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 9 నెలల్లో బొగ్గు అమ్మకం ద్వారా రూ.19,934 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.3,291 కోట్ల టర్నోవర్ సాధించినట్టు తెలిపారు.