Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలక్ట్రిక్ అద్దె బస్సుల ప్రవేశంతో ఇప్పుడు కార్యాచరణ
2025 నాటికి సంస్థలో 70 శాతం అద్దెబస్సులే..
సంస్థకు కావల్సింది 25,081 మంది ఉద్యోగులే
24,652 మందిని తగ్గించాలని అప్పట్లోనే ప్రతిపాదన
అమల్లోనే వీఆర్ఎస్...
2019లోనే పక్కా ప్రణాళిక
ఆర్టీసీకి ప్రభుత్వ
'సహకారం' డొల్లే!
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీని పూర్తిస్థాయిలో కుదించేలా ప్రభుత్వం భారీ కసరత్తునే ప్రారంభించింది. దీనికోసం పక్కా ప్రణాళికను దశలవారీగా అమలు చేసేలా వ్యూహాలు రూపొందించింది. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ అప్పులపాలైందని ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు యాజమాన్యం తీసుకుంటున్న చర్యల వల్ల నష్టాలు తగ్గుతున్నాయని చెప్తున్నది. ఈ చర్యల్ని విశ్లేషిస్తే, ప్రధానంగా సంస్థలో బస్సులు, ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవడమే లక్ష్యంగా యాజమాన్యం పనిచేసినట్టు స్పష్టమవుతున్నది. ఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆ సంస్థకు వివిధ పథకాలు, రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన సొమ్ము ఎంత అనే విషయాలు మాత్రం వెల్లడించట్లేదు. మరో రూ.1,500 కోట్లు అప్పులు తెచ్చుకొనేందుకు గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ అప్పులకు అసలు, వడ్డీ సహా ఆర్టీసీ యాజమాన్యమే చెల్లించాలి. ప్రభుత్వం కేవలం పూచీకత్తు మాత్రమే ఇస్తుంది. ఆర్టీసీని సగానికి పైగా కుదించేయాలనే ప్రతిపాదనలకు 2019లోనే బీజం పడింది. ఆర్టీసీ కార్మికుల 55 రోజుల చారిత్రక సమ్మెను అణచివేయడం కోసం న్యాయస్థానాల్లో రకరకాల అఫిడవిట్లను ప్రభుత్వం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కార్మికులతో చర్చించాలని సూచిస్తే, తప్పనిసరై అప్పటి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఆ ప్రక్రియను 'మమ' అనిపించారు. ఆ సందర్భంగా కార్మికసంఘాలకు సంస్థ స్థితిగతులపై 12 పేజీలతో కూడిన అసంపూర్తి నివేదికను ఇచ్చారు. దానికి కొనసాగింపుగా ఉన్న 13వ పేజీలో ఆర్టీసీలో సంస్కరణలు పేరుతో పక్కా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. సమ్మె విరమణ సమయంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సంస్థలో 50 శాతం ఆర్టీసీ, 50 శాతం ప్రయివేటు ఉంటాయనీ చెప్పారు. ఆ మేరకు సంస్థలో ఉద్యోగులను ఎలా కుదించాలనే ప్రణాళికనూ రూపొందించారు. ఆ సందర్భంలోని 13వ పేజీగా భావిస్తున్న ఆ ప్రతిపాదనల పత్రం రూపొందించే నాటికి సంస్థలో 8,357 ఆర్టీసీ బస్సులు ఉండగా, వాటి సంఖ్యను 5,272కి తగ్గించాలని ప్రతిపాదించారు. అలాగే అప్పటికి సంస్థలో ఉన్న 2,103 అద్దె బస్సుల సంఖ్యను 3,437కి పెంచాలని ప్రతిపాదించారు. 49,733 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 24,652 మందిని ఇంటికి పంపేయాలనీ ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించి, అద్దె బస్సులను పెంచుతారు కాబట్టి, సంస్థకు కేవలం 25,081 మంది ఉద్యోగులు సరిపోతారని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనల నివేదికలోని 13వ పేజీలో... మానవ వనరుల హేతబద్ధీకరణ కాలమ్ క్రింద ''టీఎస్ఆర్టీసీలో జీతభత్యాల ఖర్చు అధికంగా ఉంది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో 58 శాతంగా ఉన్నది. సంస్థ మనుగడ రీత్యా మానవ వనరుల ఖర్చును బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. హేతుబద్ధీకరణ దృష్ట్యా సిబ్బందిని కుదించే అంశంపై పరిశీలన జరిగింది'' అని స్పష్టంగా పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీలోని అధికారులు, మెడికల్ విభాగం, భద్రతాసిబ్బంది తప్ప, మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వీటి అమల్లో భాగంగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించి, దాదాపు రెండువేల మందికి పైగా ఉద్యోగులకు ఇంటికి పంపేసింది. ఇప్పటికీ ఆ వీఆర్ఎస్ 'ఫోర్స్'లోనే ఉన్నట్టు ఇటీవల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే 2022 వార్షిక నివేదికలో సంస్థలో 44,648 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు సంస్థలో ఉన్న 6,168 ఆర్టీసీ బస్సుల స్థానంలో రీప్లేస్మెంట్ కింద 3,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సుల్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సంస్థలో 2,938 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్తగా బస్సుల్ని కొనుగోలు చేయబోదని తేల్చిచెప్పారు. ఫలితంగా సంస్థలో దాదాపు 70 శాతానికి పైగా అద్దె బస్సులే నడువనున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉండవు కాబట్టి సంస్థలో కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్లూ ఉండబోవు. ఈ ప్రతిపాదనలను అమలుచేస్తే కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించట్లేదు. ఆర్టీసీ పరిరక్షణకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నామనే ప్రభుత్వ ప్రకటనల్లోని డొల్లతనాన్ని 2019 నాటి నివేదిక 13వ పేజీ ద్వారా బహిర్గతమైంది.
విభాగాల వారీగా సిబ్బంది తగ్గింపు ఇలా...
క్ర.సంఖ్య విభాగం, కేటగిరి ప్రస్తుత సిబ్బంది అవసరమైన తగ్గింపు
వారి సంఖ్య
1. డ్రైవర్లు 18,413 8,613 9,800
2. కండక్టర్లు 20,125 11,326 8,799
3. ఆపరేషన్స్ (ట్రాఫిక్
ఇంచార్జి,
టీఐ-2/టీఐ-3, తనిఖీ
అధికారులు) 2,660 583 2,077
4. డిపోలు, వర్క్‌షాపులు,
టైర్ షాపులు, మెకానికల్
సిబ్బంది, సూపర్వైజర్లు 5,941 2,720 3221
5. జోనల్ స్టోర్స్/ హెడ్ ఆఫీస్,
కాంట్రాక్ట్ సెల్, సిబ్బంది,
సూపర్వైజర్లు 169 93 76
6. పర్సనల్ విభాగం
సిబ్బంది, సూపర్వైజర్లు 686 349 337
7. అక్కౌంట్స్ విభాగం
సూపర్వైజర్లు,
సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ 531 294 237
8. కంప్యూటర్స్ విభాగం
సూపర్వైజర్లు,
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 107 61 46
9. భద్రతాసిబ్బంది,
సూపర్వైజర్లు 564 564 -
10. సివిల్ ఇంజినీర్
విభాగం 85 36 49
11. లీగల్ విభాగం 20 10 10
12. మెడికల్ విభాగం 108 108 -
13. అధికారులు 324 324 -
------- ------- -------
మొత్తం 49,733 25,081 24,652
------- ------- -------