Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యాచర ణను రూపొందించేందుకు వీలు గా ఈ నెల 8న నిర్వహించనున్న 'రాష్ట్ర సదస్సు'ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామంటూ రాతపూర్వకంగా హామీ ఇచ్చి తిరిగి పార్లమెంటుకు ముందుకు తెచ్చిందన్నారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని హామీ ఇచ్చి పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడంతోపాటు కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర సర్కారు నీరుగార్చి నాలుగు కార్మిక కోడ్లను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. వీటి వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులు తగ్గించి గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం చేస్తున్నదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజు పెరుగుతున్నా వాటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం...అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చలేదని చెప్పారు.ఇలాంటి విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు వీలుగా నిర్వహించబోయే రాష్ట్ర సదస్సులో అన్ని జిల్లాల నుంచి, రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్, సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు కెే. హేమలత, వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.