Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేయడం దుర్మార్గం
- ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 'సంఘర్ష' యాత్ర
- పలుచోట్ల ర్యాలీలు, సభలు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం వల్ల ప్రయివేటుకు లాభాలు, ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. రవాణారంగ కార్మికుల సంఘర్ష యాత్ర గురువారం నల్లగొండ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్లో సాగింది. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి, నాగర్కర్నూల్ పట్టణంలో ర్యాలీ తీశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో డిపో కార్యాలయం ఎదుట సభ జరిగింది. ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. పెబ్బేరు మండలంలో ర్యాలీ సాగింది. హమాలీ కార్మికులు హాజరయ్యారు. కొత్తకోటలో జరిగిన బహిరంగ సభకు వివిధ రంగాల కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. విధ్వంసమైన రహదారి వ్యవస్థ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నా యని తెలిపారు.
ఈ ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేయడం ఏమిటని ప్రశ్నించారు. అకారణంగా డ్రైవర్లను బాధ్యులను చేస్తూ జైలుకు పంపాలన్న నిబంధనకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరముం దన్నారు దేశవ్యాప్తంగా రవాణా కార్మికుల సమస్యలు మోడీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అందుకే పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా సంఘటితంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఆర్టీసీ సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. సంక్షేమ రంగం నుంచి రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలిన నూతన మోటార్ వాహన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2006లో అప్పటి ప్రధానికి ఇచ్చిన వినతిపత్రం మేరకు.. వివి గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ సంస్థ రవాణా రంగ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి 1200 పేజీల నివేదికను 2007లోనే ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. ఈ నివేదిక ద్వారా కార్మిక రంగ సంక్షేమ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పినా బుట్ట దాఖలు చేయడం దుర్మార్గమన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. చిన్నచిన్న పొరపాట్లకు వేల రూపా యల చలాన్లు వేయడం ఎంతవరకు సమంజ సమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఉపాధి కొరవడి వేలాదిమంది పీజీ, డిగ్రీలు పూర్తిచేసిన యువత ఆటో డ్రైవర్లుగా, లారీ క్లీనర్లుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కార్మికులను నడ్డి విరిచే మోటార్ వాహన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. కార్మికులకు సంక్షేమ బోర్డుతోపాటు ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ రంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రోజూ వెయ్యి రూపాయలకుపైగా సంపాదించే కార్మికుడు నేడు రూ.400కు మించి సంపాదించడం లేదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
నల్లగొండలో..
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో యాత్ర బృందానికి ఆటో, ట్రాలీ, కారు, జీపు డ్రైవర్స్, లారీ ఓనర్స్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ కార్మికులు తదితర అసోసియేషన్లు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి బీటీఎస్, భాస్కర్ టాకీస్, గడియారం సెంటర్ మీదుగా ఎస్పీటీ మార్కెట్ కార్ల అడ్డా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ముందుకు సాగింది. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ నిర్వహించారు.