Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాలతో రైతన్న ఆందోళన
- కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట తీవ్ర తోపులాట
- ముసాయిదా మాత్రమే.. అభ్యంతరాలు స్వీకరిస్తాం : కలెక్టర్ జితేష్ వి పాటిల్
నవతెలంగాణ-నిజామాబాద్
ప్రాంతీయ ప్రతినిధి, కామారెడ్డిటౌన్
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. రైతన్న ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించడంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఓ దశలో పోలీసు బారీకేడ్లను రైతులు తోసేశారు. దాంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ముగ్గురు రైతులకు గాయాల య్యాయి. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీనివ్వాలంటూ రైతులు భీష్మించుకూర్చున్నారు. రాత్రి వరకూ ధర్నా సాగింది. రైతుల ఆందోళనకు విపక్ష నాయకులు మద్దతు తెలిపారు.మాస్టర్‌ప్లాన్‌ను నిరసిస్తూ కామారెడ్డి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌లో తమ భూములు కోల్పోతామనే ఆందోళనతో విలీనగ్రామమైన అడ్లూర్ ఎల్లారెడ్డిలో పయ్యావుల రాము అనే రైతుల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురువారం ఉదయం నుంచి విలీన గ్రామాల నుంచి రైతులు, వారి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మొదట సీఎస్ఐ చర్చి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాస్టర్‌ప్లాన్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు రైతులను నిలువరించారు. రైతులను శాంతింపచేసేందుకు డీఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ప్రయత్నించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు శవాన్ని రైతులకు తెలీయకుండా జిల్లా ఆస్పత్రికి తరలించి రహస్యంగా పోస్టుమార్టం చేయించారని పోలీసులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ అనన్య వ్యాఖ్యలు రైతులను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. దాంతో ఒక్కసారిగా బారీకేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ దశలో రైతులకు, పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సమయంలో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సంతోష్, స్వామితో పాటు స్రవంతి గాయపడ్డారు. వీరిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది విలీన గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తామనే స్పష్టమైన హామీనిచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకూర్చున్నారు. రాత్రి 8 గంటలకు దిష్టి బొమ్మల కు వినతిపత్రం ఇచ్చి అనంతరం దాన్ని దహనం చేశారు.
విపక్షాల మద్దతు..
మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతుల భూములు తీసుకొని బడా వ్యాపారవేత్తలకు కట్టబెడుతోందని విమర్శించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను కలెక్టరేట్ వద్ద అరెస్ట్ చేశారు. ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్రావు పాల్గొని మద్దతు తెలిపారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో రాజీనామాలు
మాస్టర్‌ప్లాన్ వివాదం తీవ్రమవడంతో అడ్లూర్ఎల్లారెడ్డిలోని ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. సర్పంచ్ సైతం రాజీనామా చేయాలని సర్పంచ్ భర్తపై స్థానిక రైతులు దాడి చేశారు.
అభ్యంతరాలు చెప్పండి: కలెక్టర్
మాస్టర్‌ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమేనని, దీనిపై అభ్యంత రాలుంటే తెలపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. రైతులు ఆందోళన విరమించాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌కు ఇంకా ఆమోద ముద్ర పడలేదని వివరించారు. అభ్యంతరాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రైతులు స్వయంగా వచ్చి తమ అభ్యంతరాలు చెప్పాల న్నారు. రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
మాస్టర్‌ప్లాన్‌ను మార్చాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్
నవతెలంగాణ-సదాశివనగర్
మాస్టర్ ప్లాన్‌తో తమ భూములు కోల్పోతున్నామనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్ డిమాండ్ చేశారు. మాస్టర్‌ప్లాన్‌పై అనేక సందేహాలు రైతులకు వ్యక్తమవుతున్నాయని, బాధిత రైతులతో సమావేశం నిర్వహించి వారి సందేహాలు నివృత్తి చేసి అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా ప్లాన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద పార్టీ ఎల్లారెడ్డి ఏరియా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదాశివనగర్ మండలం అడ్లుర్ ఎల్లారెడ్డి గ్రామా నికి చెందిన రైతు పయ్యావుల రాములు తన భూమి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇండిస్టీస్ జోన్ పరిధిలోకి వెళ్తే భూమి పోతుందని మనస్తాపంతో ఆత్మ హత్య చేసుకున్నాడని, మున్సిపల్ అధికారుల తప్పుడు ప్రచారం వల్ల అనేక మంది పేదలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు మాస్టర్ ప్లాన్‌పై స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతీరాం నాయక్, చంద్రశేఖర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపాల్టీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయండి
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
కామారెడ్డి మున్సిపాల్టీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరకమని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టార్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడంతో కొద్దిగా భూములు ఉన్న సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దీనికి మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా వారి అభిప్రాయం సేకరించకుండా ప్లాన్‌ను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.