Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9,370 టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తింపు
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
- ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ
- నాన్చుడు ధోరణిలో రాష్ట్ర సర్కారు
- ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,360, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు 2,179, పీఈటీ పోస్టులు 162, భాషా పండితుల పోస్టులు 669 ఉన్నాయి. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి గతేడాదిలోనే ప్రభుత్వానికి పంపించింది. కానీ ఇంత వరకూ ఆర్థిక శాఖ ఆమోదించకపోవడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు లక్షల మంది ఆందోళనలో ఉన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా?అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లతోపాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. త్వరలోనే గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నది. రాష్ట్రంలో గతేడాది జూన్ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష జరిగింది. ఆ ఫలితాలు జులై ఒకటిన విడుదలయ్యాయి. పేపర్-1లో 1,04,078 (32.68 శాతం) మంది, పేపర్-2లో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. టెట్ ఫలితాలు వచ్చి ఇప్పటికే ఆర్నెల్లు దాటింది. అయినా పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
సర్కారు తీరుపై ఉపాధ్యాయుల గుర్రు
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులు కలిపి 13,086 ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణలో పాఠశాలల్లో 18,588 ఖాళీలున్నాయంటూ ఇటీవల పార్లమెంటులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ప్రాథమిక విద్యలో 11,348, మాధ్యమిక విద్యలో 4,774 కలిపి మొత్తం 16,122 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ నివేదికను సమర్పించింది. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం 9,370 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం గమనార్హం. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం 22 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నాయంటూ ప్రకటిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలెన్ని?అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇంకోవైపు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపడతామన్న ప్రభుత్వ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. భాషాపండితులు, పీఈటీల అప్గ్రెడేషన్ ప్రక్రియ పెండింగ్లోనే ఉన్నది. 5,571 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులనూ ప్రభుత్వం మంజూరు చేయలేదు. 2019-20 విద్యాసంవత్సరంలో 15,661 మంది విద్యావాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో వారి సేవలను వినియోగించలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ విద్యావాలంటీర్లను ప్రభుత్వం తీసుకోలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకోవాలంటూ విద్యాశాఖ ఆదేశించింది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపైనే అదనపు భారం పడుతున్నది. ఇలా అనేక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవో వంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. అవి ఇన్ఛార్జీలతోనే నడుస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయ అభ్యర్థులు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వెంటనే ప్రభుత్వం అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ను జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ పోస్టులకు అనుమతి ఇవ్వాలి : రావుల రామ్మోహన్రెడ్డి
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్టీ కోసం సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం అభ్యర్థులను పట్టించుకోకుండా టెట్ నిర్వహించి చేతులు దులుపేసుకుందని విమర్శించారు. ఎనిమిది నెలలైనా టీఆర్టీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీలకు అనుమతి ఇచ్చి వెంటనే వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.