Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికలను ఇంట్లో పెట్టి తాళం వేసిన ఆటోడ్రైవర్
- ఇంటిపై గ్రామస్తుల దాడి
నవతెలంగాణ-భువనగిరి రూరల్
ఇద్దరు బాలికల కిడ్నాప్ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలో కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఆటోడ్రైవర్ ఇంట్లో బాలికలను గుర్తించిన గ్రామస్తులు ఆ ఇంటిపై దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దారితీసింది. పోలీసులు, స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు లాగానే గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థినులు పాఠశాలలో లేకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్రామంలో పాఠశాలల విద్యార్థులను విచారించారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన యాకేష్ ఆటో డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి చెప్పిన సమాచారం ప్రకారం.. అక్కడికెల్లగా ఆ యువకుడి ఇంటికి తాళం వేసిండగా, పగలగొట్టారు. ఆ ఇంట్లో ఇద్దరు బాలికలను చూసి.. వారిని కిడ్నాప్ చేసింది యాకేష్నే అని తెలియడంతో బాధిత కుటుంబీకులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్తులు ఆ ఇంటిపై దాడి చేసి రెండు బైక్‌లను దహనం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు తిరగబడ్డారు. దాంతో నలుగురు గ్రామస్తులకు, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. యువకున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.