Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుం రూ.వందకు కుదింపు
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై ఇంటర్ బోర్డు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శని, ఆదివారం ఫీజు చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఇంటర్ బోర్డు చైర్మెన్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల ప్రకారం ఆలస్య రుసుం రూ.వెయ్యి నుంచి రూ.వందకు కుదించామని తెలిపారు. విద్యార్థులు శని, ఆదివారాల్లో ఆలస్య రుసుం రూ.వందతో పరీక్ష ఫీజును చెల్లించాలని కోరారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో 15 మీటర్ల వరకు ఉన్న కాలేజీలకు సడలింపునిస్తూ గతనెల 23న హోం శాఖ జీవో నెంబర్ 72ను విడుదల చేసిందని గుర్తు చేశారు. దానిప్రకారం కాలేజీలకు అనుబంధ గుర్తింపును ప్రకటించామని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులను వసూలు చేసి ఇంటర్ బోర్డుకు ఆదివారం నాటికి కట్టాలని ఆదేశించారు. ఫీజు చెల్లింపునకు గడువును పొడిగించబోమని స్పష్టం చేశారు. అయితే ఆయా కాలేజీల యాజమాన్యాలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిసి ఆలస్య రుసుంను తగ్గించాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఆలస్య రుసుం రూ.వందకు తగ్గించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. దీంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.