Authorization
Fri May 02, 2025 08:23:46 pm
- బస్‌భవన్ వద్ద ముగిసిన 'మునుగోడు' పాదయాత్ర
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్ బాబు డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మూడవ రోజు హైదరాబాద్ బస్‌భవన్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం లాగేసుకోవడం సరికాదన్నారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్దరించాలన్నారు. సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 2017, 2021 వేతన సవరణలు ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పని భారాలు తగ్గించి, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలనీ, 2013 వేతన సవరణ బాండ్ల డబ్బులు చెల్లించాలని కోరారు. ఆర్టీసీలో యూనియన్లను అనుమతిస్తామని ఎవరికీ హామీ ఇవ్వలేదని చైర్మెన్ కే బాజిరెడ్డి గోవర్థన్ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర నాయకులు ఏవీ రావు మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి సకల జనుల సమ్మె వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, సీసీఎస్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమానికి సమాఖ్య సలహాదారులు బీజేఎమ్ రెడ్డి అధ్యక్షత వహించారు. పాదయాత్రలో పాల్గొన్న మారగోని అంజయ్య కత్తుల యాదయ్య, సర్కంటి మోహన్‌రెడ్డి, కొవ్వూరు యాదయ్య. మోసిన్, దశరధ్, కంది రవీందర్‌రెడ్డి తదితరులు బహిరంగసభలో ఉన్నారు.