Authorization
Thu May 01, 2025 01:57:20 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. 'మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్' మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ జా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ జా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా, వైద్య రంగాల్లో ముకర్రమ్ జా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. టర్కీలోని ఇస్తాంబుల్లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ జా మృత దేహంను హైదరాబాద్కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ను ఆదేశించారు. సీఎం సూచనల మేరకు అందుకు సంబంధించిన పనులను ఆయన సమన్వయం చేస్తున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఎనిమిదవ నిజాం ముకర్రమ్ జా బహదూర్ మరణం పట్ల రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. మకర్రమ్ జా బహదూర్ తాత నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కాలంలోని ఆదర్శప్రాయమైన లౌకిక వాది అనీ, తన ప్రాణం కంటే ప్రజలను ఎక్కువగా అభిమానిస్తుండేవారని తెలిపారు. హిందువులు, ముస్లింలు నా రెండు కళ్లు అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారనీ, ఉస్మానియా యూనివర్సిటీ, రైల్వే లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ , ఆర్టీసీ బస్సుల, ఆసుపత్రుల ఏర్పాటు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారని పేర్కొన్నారు.. ఆయన కుటుంబ సభ్యులకు హౌంమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవాబ్ మకర్రమ్ జా బహదూర్ కోరిక మేరకు ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులోనే అతని ఖననం నిర్వహిస్తామని హౌం మంత్రి తెలిపారు.
ఎనిమిదో నిజాం నవాబ్ మృతికి కాసాని సంతాపం
హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బరికేత్ అలీఖాన్ వాలాషాన్ ముఖరమ్జా బహూదూర్ మృతిపై తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం వ్యక్తం చేశారు.