Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్‌ను హత్య చేసిన ధర్మా నాయక్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాయక్ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు తేలింది. బీమా డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ నెల 9వ తేదీన జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారులో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మొదటగా ఈ ప్రమాదంలో మతి చెందింది బీమ్లా తండాకు చెందిన ధర్మగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా ఆయన పని చేస్తున్నారు. ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తన డ్రైవర్‌ను చంపేసి.. తాను చనిపోయినట్లు నిరూపించుకుని బీమా డబ్బులు పొందాలని తనను తాను చంపుకున్నట్లు పరిసరాలను సృష్టించుకున్నాడు. కాగా.. ధర్మ సెల్‌ఫోన్ సిగల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ధర్మ గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ధర్మను విచారించగా అసలు విషయం బయటపెట్డాడు. అప్పులు చేసి బెట్టింగ్‌లు అడే అలవాటు ఉన్న ధర్మ.. బీమా సొమ్ము కోసం ఈ అఘాత్యానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ధర్మను బుధవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.