Authorization
Tue April 29, 2025 01:53:31 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికులు సృష్టించిన సంపదను బడా పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ విమర్శించారు. లేబర్ కోడ్లు తెచ్చి పరిశ్రమల అధిపతులకు మేలు చేస్తున్న మోడీ ప్రభుత్వంపై శ్రామికవర్గం తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ నేతల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తిరోగమన విధానాలు తిప్పికొట్టేందుకు ఇతర సంఘాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సదస్సులో నిర్వహిస్తామని తెలిపారు. మే నుంచి ఆగస్టు 8 వరకు క్విట్ ఇండియా దినోత్సవంలో భాగంగా పోరుయాత్రలు, మోటర్ సైకిల్ యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించి సంఘటిత, అసంఘటిత శ్రామికవర్గాల్లో చైతన్యం కల్పిస్తామని వెల్లడించారు. ఆగస్టు 9న హైదరాబాద్ భారీ నిరసన సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏఐటీయూటీసీ సీనియర్ నాయకులు రత్నాకర్ రావు మాట్లాడుతూ కార్మికవర్గం రెట్టింపు ఉత్సాహంతో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యం.నర్సింహ్మ మాట్లాడుతూ కార్మికవర్గంలో సైద్ధాంతిక ఆలోచన ఉన్నప్పటికీ కార్మిక వర్గ దృక్పథాన్ని అలవర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.చంద్రయ్య, పి.ప్రేంపావని వ్యవహరించారు.