Authorization
Tue April 29, 2025 11:30:56 am
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. 'నాటు నాటు' పాటతో తెలుగు పల్లీయుల పదబంధాలను ఉపయోగించి, సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన చంద్రబోస్ అభినందన సభ సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందచారి, సహకార్యదర్శి ఎన్కే సలీమా, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కాళోజి అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ మొట్టమొదటిసారి తెలుగు గీతానికి ఆస్కార్ అవార్డు రావడం అందరికీ గర్వకారణమని అన్నారు. 28న జరిగే అభినందన సభకు కవులు, రచయితలు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాలు భాగస్వామ్యం అయ్యాయి.