Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిట్టుబాటు ధరల కోసం ఇంకెంత కాలం కొట్లాడాలి..?
- పంజాబ్, యూపీ ఎన్నికల కోసమే నల్ల చట్టాల ఉపసంహరణ ప్రకటన
- రైతు సమస్యలపై ప్రధానికి చిత్తశుద్ది లేదు : మహారాష్ట్ర రైతు నేతల సమావేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల సమస్యలపై ప్రధాని మోడీకి చిత్తశుద్ది లేదని చెప్పారు. రైతుల బాధలు తెలిసిన నాయకులే వారి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. తెలంగాణలో రైతుల సమస్యలు పరిష్కారమైనప్పుడు..మహారాష్ట్రలో ఎందుకు పరిష్కారం కావని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులతో శనివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ రాష్ట్రంలో రైతుల కష్టాలను రైతు నాయకులు వివరించారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలోని రైతుల కష్టం చూసి రైతుల సమస్యలను తలకెత్తుకున్నానని చెప్పారు. తన 50 ఏండ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఆందోళనలు, సమస్యలు, ఆటుపోట్లను చూశానని..చిత్తశుద్దితో ప్రయత్నం చేసి విజయం సాధించామన్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి 1935 నుంచి పోరాటాలు సాగుతూనే వున్నాయనీ, సర్ చోటూరామ్, మహిందర్ సింగ్ టికాయత్, శరద్ జోషీ, చౌదరి చరణ్ సింగ్, దేవిలాల్ వంటి నేతల నుంచి నేటి గుర్నామ్ సింగ్ దాకా రైతు సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. తమ హక్కుల సాధన కోసం నల్ల చట్టాలు ఎత్తేయాలని 13 నెలల పాటు దేశ రైతులు రాజధాని ఢిల్లీ రోడ్లమీద ఆందోళన చేస్తే.. వారిని నక్సలైట్లు అని, తీవ్రవాదులు అనీ కేంద్ర ప్రభుత్వం ముద్రవేసిందన్నారు. ఆసమయంలో రైతుల కోసం ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. 750 మంది రైతులు అమరులైన తర్వాత ప్రధాని దిగివచ్చి రైతులకు క్షమాపణలు చెప్పిన సంగతిని గుర్తుచేశారు. పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసమే రైతులకు ప్రధాని తియ్యటి మాటలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకున్నాడని అన్నారు. అయినా, ఇప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. గిట్టుబాటు ధరల కోసం రైతులు ఇంకెంత కాలం పోరాడాలి..? అని కేసీఆర్ ప్రశ్నించారు.కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుంటే..ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రిజర్వాయర్లల్లో నీళ్లు నిండుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఇంతటి ప్రగతి సాధ్యమైతే..పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మన దేశంలో సహజ సంపదలకు కొదువలేకున్నా..అసమర్థ నాయకత్వం వల్ల వెనకబడ్డామని చెప్పారు. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదన్నారు. తెలంగాణ మోడల్ రైతు సంక్షేమాన్ని మహారాష్ట్రలో అమలు చేసి చూపించేందుకే తాను మహారాష్ట్ర వస్తున్నానని ఫడ్నవీస్ విమర్శలకు కేసీఆర్ బదులిచ్చారు. మోడీ ప్రధాని కాకముందు దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ గోదాములు నిర్మిస్తుండేదనీ, మోడీ పీఎం అయిన తర్వాత మొత్తం అదానీకి గుత్తకిచ్చారని తెలిపా రు. రైతు సమస్యల పరిష్కారం కావాలంటే రైతు రాజ్యాన్ని తెచ్చుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. దీని కోసం రోడ్ల మీద ఆందోళనలు, పోరాటాలు అవసరం లేదు.. లాఠీ దెబ్బలు, తూటాలు తినాల్సిన అవసరం లేదు. ఓటు ఆయుధాన్ని వాడుకుంటే చాలని సూచించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ 200 సీట్లు గెలుస్తుందనీ, అందుకు గట్టి సంకల్పం కావాలని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రైతు నాయకులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తే తెలంగాణ ఫలితాలే దేశమంతా వస్తాయని కెసిఆర్ వివరించారు.
మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ( మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘం)కు చెందిన ముఖ్య నేతలు సుధీర్ బిందు, కైలాష్ తవార్, శరద్ మర్కాడ్, సువర్ణ కాఠే, రాంజీవన్ బోండార్, నారాయణ్ విభూధే, బిజి కాకా, అనిల్ రజంకార్, పవన్ కర్వార్, భగవత్ పాటిల్, తదితరులు కేసీఆర్ సమక్షంలొ బీఆర్ఎస్లో చేరారు.