Authorization
Thu April 10, 2025 06:00:17 pm
నవతెలంగాణ-జనగామ
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడవ మహాసభలకు జనగామ ముస్తాబైంది. జనగామ పట్టణాన్ని తోరణాలతో అలంకరించారు. అలాగే, మహాసభ జరిగే వైష్ణవి గార్డెన్ అంతా ఎరుపెక్కింది. మహాసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య తెలిపారు. శనివారం ఉదయం జనగామ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ గ్రౌండ్ నుంచి వైష్ణవి గార్డెన్ వరకు వేలాది మందితో నిర్వహించే మహా ప్రదర్శనతో మహాసభ ప్రారంభం కానుంది. అనంతరం వైష్ణవి గార్డెన్స్‌లో రజకుల రక్షణ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ మహాసభకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొని ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ మహాసభలో రజకుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యరూపాన్ని రూపొందించనున్నట్టు ఆశయ్య తెలిపారు. మహాసభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు.