Authorization
Thu April 10, 2025 06:07:05 am
- హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్
రెవెన్యూ శాఖలో భూమి హక్కులు, రికార్డుల సమస్యల పరిష్కారం పేరుతో తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఆ సమస్యలు మరిన్ని పెరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులో దాఖలయ్యే కేసులను బట్టి చూస్తే ధరణిలో సమస్యలు 20కిపైగా ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వీటిని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ధరణిలో సమస్యలపై కలెక్టర్ ద్వారా గ్రామ, మండల రెవిన్యూ ఆఫీసర్ల అభిప్రాయాలు తెలుసుకుని చట్ట ప్రకారం పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఎలకు ఇటీవల జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. రెవిన్యూ శాఖలో రిజిస్టర్ సేల్ డీడ్స్, సర్టిఫైడ్ కాఫీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు రిట్లను ఇటీవల విచారణ చేసిన హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. గడువులోగా ఈ-పట్టాదారు పాస్‌బుక్స్‌లో సవరణలకు ఆన్లైన్లో దరఖాస్తులు, సర్వేకు దరఖాస్తులను స్వీకరించకపోవడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్న ఆస్తుల దస్తావేజులను ఇవ్వకపోవడం, ధరణి పోర్టల్‌లో ఉన్న జీపీఏలను రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం వంటి వాటిని పరిష్కరించాలని చెప్పింది. రెవిన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లకు, రివిజన్ నిమిత్తం నిబంధనలు లేవని చెప్పింది. ఒక నిర్దిష్టమైన ఆస్తిపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వస్తే మొత్తం సర్వే నెంబరును నిషేధిత జాబితాలో చేర్చడాన్ని తప్పుపట్టింది. యజమాని మరణించాక వాళ్ల వారసులు పట్టా పొందడానికి అవకాశం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని, వాటిని జూన్ 15న జరిగే విచారణలో చీఫ్‌సెక్రటరీ, ఇతరులు నివేదించాలని ఆదేశించింది.