Authorization
Thu April 10, 2025 04:35:01 pm
- కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, సుంకేట అన్వేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాలతో పంటలు, ధాన్యం తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తడిసిన ధాన్యం, పంటలను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. ధరణి లోపాలను సవరించాలంటూ హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదని విమర్శించారు. రైతుల పేరిట రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ భూముల విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నదని చెప్పారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కోర్టు 15 రోజుల సమయం ఇచ్చిందనీ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు.