Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఏవీ..?
- బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో నిరుద్యోగ మార్చ్ చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరపాలనతో పెట్టుబడుల వెల్లువ
- రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో హ్యాట్రిక్ పక్కా
- ఫ్యాక్స్్కాన్ కంపెనీతో 40 వేల మందికి ఉపాధి : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫ్యాక్స్‌కాన్ కంపెనీ నిర్మాణాలకు శంకుస్థాపన
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ మార్చ్ చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే మోడీపై నిరుద్యోగ మార్చ్ చేయాలని సవాల్ విసిరారు. పేపర్లు లీక్ చేసి విద్యార్థులు, యువతను ఇబ్బందులకు గురి చేసిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే సుస్థిరమైన ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వం వచ్చినట్టని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొంగర కాలన్ గ్రామంలో సోమవారం 'ఫ్యాక్స్‌కాన్ కంపెనీ'కి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు.
ఫ్యాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టించేందుకు మార్చి 2న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. రెండున్నర నెలల్లో ప్లాంట్‌కు భూమి పూజ నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. ఫ్యాక్స్‌కాన్ కంపెనీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నంత వేగం, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న నిబద్ధత ఇంకెక్కడ చూడలేదని మీడియా సాక్షిగా ఫ్యాక్స్‌కాన్ ప్రతినిధి బృందం చెప్పడం గర్వంగా ఉందన్నారు. తొమ్మిదేండ్లలో దేశ విదేశాలకు తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. ఫ్యాక్స్‌కాన్ కంపెనీతో 35 నుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయని, మొత్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఇందులో ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఉద్దేశంతో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో సంపద సృష్టికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని రంగాలను, అన్ని వర్గాలను కలుపుకొని సంక్షేమమే ఎజెండాగా ముందుకు పోతుందన్నారు. రాష్ట్రం వ్యవసాయం నుంచి ఐటీ దాకా అన్ని రంగాల్లో అగ్రపథాన దూసుకుపోతుందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావస్తుందన్నారు. మూడు, నాలుగేండ్లలో కొంగర కలాన్, మహేశ్వరం ప్రాంతాలు ప్రగతి బాట పట్టాయని తెలిపారు. 'రజనీకాంత్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ న్యూయార్క్ నగరంలా మారిందని ఊరికే అనలేదని, నగరం అద్భుతంగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్్కాన్ కంపెనీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.