Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో నలుగురు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో వెలుగు చూసిన రూ. 231 కోట్ల వాణిజ్య పన్నుల శాఖ బోగస్ చలాన్ల కుంభకోణంలో మరో నలుగురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వివరాళ్లోకెళ్తే.. బోధన్‌లో 2013లో బోగస్ చాలన్లతో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల కుచ్చుటోపిని తొడిగే దళార్ల వ్యవహారం మొదలైంది. ఇందుకు వాణిజ్య పన్ను శాఖకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ బోగస్ చలాన్ల అక్రమార్కులతో చేతులు కలిపారు. ముఖ్యంగా, దళారులైన సింహాద్రి శివరాజ్, అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌తో పాటు వారి కంపెనీలకు చెందినవారు ఈ బోగస్ చలాన్ల కుట్రలకు తెరలేపారు.
వ్యాట్‌లో తప్పుడు సమాచారాన్నిస్తూ బోగస్ చలాన్ల రూపంలో దాదాపు రూ. 231,22,97,000 మేరకు వాణిజ్య పన్నుల శాఖకు పన్నులు చెల్లించకుండా అవి చెల్లించబడినట్టు బోగస్ చలాన్లు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ విషయమై 2017లో తమకందిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును సీఐడీకి బదిలీ చేశారు. తర్వాత ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి చెందిన కొందరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు మరికొందరు, దళారులు, వ్యాపారులను ఈ కుంభకోణానికి బాధ్యులుగా చేస్తూ అరెస్టు చేశారు. ఆ సమయంలో మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తును సాగించిన సీఐడీ అధికారులు డీఎస్పీ శ్యామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో తాజాగా మంగళవారం రోజు ఈ కుంభకోణంతో సంబంధమున్న విజరుకుమార్, జె. రాజయ్య, సాయిలు, స్వర్ణలతలను అరెస్టు చేశారు. వీరిని కరీంనగర్‌లోని సీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.