Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
భవన నిర్మాణ రంగ కార్మికులకు దరఖాస్తు చేసిన మూడు నెలల్లోపు క్లెయిమ్లు చెల్లించాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ (బీసీడబ్ల్యూయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం నిర్వహించిన యూనియన్ ములుగు, భూపాలపల్లి జిల్లాల మహాసభకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక శాఖలో సభ్యత్వం పొందిన కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్మిస్తామని చెప్పారు. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని, హక్కులు సాధించుకోగలమని స్పష్టం చేశారు. కార్మికులు కార్మిక శాఖ ద్వారా అందాల్సిన సాయం కోసం దరఖాస్తు చేసిన సందర్భాల్లో డబ్బులు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, నాయకులు వెంకటేష్, బండి నర్సయ్య చిలకాని రాజయ్య, పొలం కొండయ్య, జక్కుల ఐలయ్య, శ్రీనివాస్, సామల చిన్న రామన్న, రాంచందర్, మొగిలి, ఉపేందర్, రమేష్, లక్ష్మీరాజం, రాజయ్య, రాజమౌళి, ముత్యాల రాజు, తదితరులు పాల్గొన్నారు.